Polavaram Back Water: జోరు వర్షాలు, భారీ వరదలతో గోదావరి తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో తీవ్రంగా నష్టపోతోంది. భారీ వర్షాలతో వరదలు రాగా నష్టం రోజురోజుకూ తీవ్రం అవుతోంది. భద్రాచలం పరిధిలోని పలు మండలాలు ముంపుకు గురయ్యాయి. అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం జిల్లాలోని ప్రాంతాలు పోలవరం ప్రాజెక్టు వల్లే ముంపును ఎదుర్కొంటున్నాయని తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తారు. 


పోలవరం వల్లే భద్రాచలానికి ముప్పు..


పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో భద్రాచలం ముంపుకు గురి అవుతోందని తెలంగాణ రాష్ట్ర నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణలోని పలు మండలాలను ఏపీలో కలిపిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ వస్తోంది. అక్కడి ప్రజలు సైతం తమను తెలంగాణలో కలపాలని ఆందోళనలు, ధర్నాలు చేస్తూ వస్తున్నారు. 


పోలవరం బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయండి..


తాజాగా పోలవరం ప్రాజెక్టుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ - పీపీఏ కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ శనివారం లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కడుతున్న పోలవం ప్రాజెక్టు వల్ల భద్రాచలం పుణ్య క్షేత్రం సహా.. పలు మండలాలు ముంపును ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని ఇప్పటికే చాలా సార్లు కేంద్రంలోని బీజేపీ సర్కారును కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ లేఖలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ - పీపీఏ ఆ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం వెనక జలాల వల్ల ఏర్పడే పరిస్థితులు, ప్రభావాలపై ఏదైనా స్వతంత్ర సంస్థతో స్టడీ చేయించాలన్నారు. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీరు నిల్వ ఉంటే భద్రాచలం ప్రాంతానికి ముప్పు మరింత పెరుగుతుందని, మున్నేరు వాగు, కిన్నెరసాని నదుల పరిసర ప్రాంతాలు పోలవరం బ్యాక్ వాటర్ లో మునిగిపోతాయని లేఖలో పేర్కొన్నారు. బ్యాక్ వాటర్ వల్ల ఇబ్బంది కలగకుండా రక్షణ కట్టడాలు నిర్మించి ముంపు ముప్పును నివారించాలని కోరారు. 


బ్యాక్ వాటర్ తో ముంపు..


ఇటీవలి కాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిలో రికార్టు స్థాయి వరద ప్రవాహం వస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అయితే ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్.. భద్రాచలం సహా పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. దాదాపుగా 90 గ్రామాలకు పోలవరం బ్యాక్ వాటర్ సమస్యగా మారింది. ప్రజలపై పెను భారం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ లో సహా.. వరద సమస్య పరిష్కారం కోసం అన్ని మార్గాల్లో పోరాడాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. 


వరద సమస్యను పరిష్కరించండి..


పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం, ఐటీసీ భద్రాచలం, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ లకు కూడా ముప్పు ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న అణు శక్తి విభాగం, ఐటీసీ భద్రాచలం రెండూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ - పీపీఏ కు లేఖలు రాశాయి.