Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. పదేళ్ల రాష్ట్ర చరిత్రలో 2013 జులై 19వ తేదీన ములుగు జిల్లా వాజేడులో కురిసిన 51.75 సెంటీ మీటర్ల వర్షం అత్యధికంగా ఉండేది. కానీ గురువారం రోజు కురిసిన వర్షం ఈ రికార్డును తిరగరాసింది. మూడో గరిష్ఠానికి చేరుస్తూ.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెంటీ మీటర్లు కురిసింది. రాష్ట్ర వర్షపాతంలో రోజురోజుకూ కొత్త గణాంకాలు చేరుతున్నాయి. జులై 27వ తేదీ గురువారం రోజు కురిసిన కుండపోత వర్షానికి ఒకేసారి నాలుగు చోట్ల కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 61.8 సెం.మీ వర్షం కురిసింది. ఇది రాష్ట్ర చరిత్రలో రెండో అత్యధికం. కొత్తగా భూపాలపల్లి జిల్లా చెల్పూరులో 47 సెం.మీ, రేగొండలో 46 సెం.మీ అయిదు, ఆరు గరిష్ఠ వర్షపాతాలుగా నిలిచాయి. 2013 జులై 23వ తేదీన భీమ్ జిల్లా దహేగాంలో కురిసిన 50.36 సెం.మీ కురిసి 4వ అత్యధికంగా కొనసాగుతోంది.
గత మంగళవారం అంటే జులై 17వ తేదీన నిజామాబాద్ జిల్లా వేల్పూరులో కూరిసిన 43.1 సెం.మీ ఏడో స్థానంలో నిలిచింది. 2016 సెప్టెంబర్ 24వ తేదీన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో కురిసిన 39.5 సెం.మీ ఎనిమిదో గరష్ఠంగా ఉంది. గురువారం రోజు వరంగల్ జిల్లా మొగుళ్ల పల్లిలలో 39.4 సెం.మీ, భద్రాద్రి జిల్లా కర్కగూడెంలో 39 సెం.మీ, కరీంనగర్ జిల్లా మల్యాలలో 38.5 సెం.మీ కురిసింది. ఇలా 9 నుంచి 11వ భారీ వర్షపాతాలుగా నిలిచాయి. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ లో 36.3, ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 32.6 కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోల 31.2, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 31.1 సెం.మీ వర్షం కురిసింది. అలాగే రాష్ట్రంలోని మొత్తం 25 ప్రాంతాల్లో 20 సెం.మీ వర్షం కురవగా.. 240 కేంద్రాల్లో 10 సెం.మీకు పైగా వర్షం పడింది.
మరోవైపు నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు
నేడు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు (అసాధారణమైన వర్షం (>24 cm)) తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.