Telangana Weather Updates | హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే వీలుందని పేర్కొంది. ముఖ్యంగా ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆదివారం రాత్రి వరకు హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం లేదని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. దాంతో ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు ఏ ఢోకా లేదు.

Continues below advertisement

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా ప్రకటనలో వివరించింది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయని తెలిపింది. ఆ తర్వాత వచ్చే మూడు రోజుల్లో మాత్రం ఎండ తీవ్రత క్రమంగా తగ్గి, సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు, పలు జిల్లాల్లో వర్షాల సూచనఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత, ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని పేర్కొన్నారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 124 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నీళ్లు, మజ్జిగ తాగుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడనుందని ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం సైతం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల దృష్ట్యా రైతులు తమ వ్యవసాయ పనుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.