CM Revanth Reddy: ఏపీలో జగన్ సభలకూ పర్మిషన్లు నిరాకరించారు -పవన్ సభపై పోలీసులదే ఆ నిర్ణయం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Telangana Meeting: పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడం అనేది పూర్తిగా పోలీసుల నిర్ణయం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన తెలంగాణకు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.

CM Revanth Reddy On Pawan Kalyan : తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య నడుస్తున్న 'సభల అనుమతి' వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా నోరు విప్పారు. శుక్రవారం సచివాలయం వేదికగా పలు రాజకీయ, సామాజిక అంశాలపై మీడియా ప్రతినిధులతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో సభ నిర్వహణ, దానికి పర్మిషన్ నిరాకరణపై చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారు. పవన్ కల్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు తమ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే పక్కాగా సమాధానం ఇచ్చారని, ఈ వ్యవహారాన్ని అంతకంటే ఎక్కువ ఊహించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కక్షసాధింపులు లేవని, అది కేవలం పోలీస్ శాఖ అంతర్గత నిర్ణయమని రేవంత్ రెడ్డి సమర్థించారు. జూన్ 2న నిర్వహించాలనుకున్న సభ వల్ల నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే పోలీసులు అనుమతి నిరాకరించారని గుర్తు చేశారు. శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఇందులో సెలెక్టివ్ పాలిటిక్స్ ఏవీ ఉండవని తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేవలం తెలంగాణలోనే సభలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ జనసేన శ్రేణులు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఏపీలో కూడా గతంలోనూ, ప్రస్తుతం కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించే కొన్ని సభలకు, ర్యాలీలకు అక్కడి రక్షక భద్రతా దళాలు కొన్నిసార్లు అనుమతులు నిరాకరించిన ఉదంతాలు ఉన్నాయని ఉదాహరణగా చెప్పారు. ఇదంతా పోలీస్ నిబంధనల ప్రకారం సాగుతుందే తప్ప దీనికి ప్రాంతీయ విద్వేషాలను ఆపాదించడం సరికాదన్నారు.
తెలంగాణ గడ్డపై ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఉనికిని చాటుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "పవన్ కల్యాణ్ తెలంగాణకు ఎప్పుడైనా రావచ్చు.. పోవచ్చు.. ఇక్కడ తన పార్టీ తరఫున పోటీ కూడా చేసుకోవచ్చు. దానికి మాకెలాంటి అభ్యంతరాలు లేవు" అని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అందరిదన్న భావనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే స్థానిక సెంటిమెంట్లు, ప్రజా శాంతిని భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరించారు. పవన్ కల్యాణ్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కౌంటర్ వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో లేని వారు ఇప్పుడు వచ్చి ఇక్కడి రాజకీయ స్థిరత్వాన్ని ప్రశ్నిస్తే స్థానిక నేతలుగా స్పందించడం సహజమేనన్నారు
మరోవైపు, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించి ఆమె నామినేషన్‌ను రద్దు చేయించిందని మండిపడ్డారు. దేశంలో ఇప్పటికే ఓట్ల దొంగతనం కి అలవాటు పడ్డ బీజేపీ, ఇప్పుడు ఏకంగా సీట్ల దొంగతనం కి తెరలేపిందని ధ్వజమెత్తారు. ఎక్కడో తెలంగాణ నాంపల్లి కోర్టులో ఉన్న ఒక చిన్న సాంకేతిక లొసుగును అస్త్రంగా చేసుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని లాక్కోవడం అత్యంత దుర్మార్గమని, ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి రోజని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాల కుటిల రాజకీయాలపై తాము న్యాయపరంగా, రాజకీయంగా గట్టిగా పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















