Telangana Police Instructions To Stop Cyber Crimes: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏపీకే ఫైల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింక్స్ వంటివి పంపిస్తూ సైబర్ నేరగాళ్లు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ దోచుకుంటున్నారు. కొత్త కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా ఊహకందని రీతిలో ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ భద్రతపై (Cyber Security) ప్రజల్లో అవగాహన పెంచి మోసాల బారిన పడకుండా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యొద్దంటూ పేర్కొంటున్నారు.


కీలక సూచనలివే.. 



  • అపరిచితులు పంపిన లింక్స్, వెబ్‌సైట్స్‌ల్లో పాప్‌అప్స్ క్లిక్ చెయ్యొద్దు. బ్యాంక్ కార్డ్స్ వెనుక ఉండే సీవీవీతో పాటు మీ వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, క్రెడిట్/డెబిట్ కార్డుల సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులకు పంపొద్దు.

  • పోర్న్‌సైట్స్ చూస్తున్నట్లుగా తప్పుడు ఆరోపణలతో వచ్చే ఈ మెయిల్స్/మెసేజ్‌లను అస్సలు నమ్మొద్దు. మీ స్నేహితులు, బంధువులు లేదా పై అధికారుల వాట్సాప్ డీపీలతో ఉన్న ఖాతాల నుంచి డబ్బులు అడిగినట్లుగా వచ్చే సందేశాలను నమ్మొద్దు. ఒకవేళ.. అలాంటి మెసేజ్ వస్తే.. మీ ఫ్రెండును నేరుగా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చెయ్యండి.

  • మీకు తెలియని, అనుమానిత ఈ మెయిల్స్, అటాచ్‌మెంట్స్ ఓపెన్ చెయ్యొద్దు. మీ కంప్యూటర్లు, మొబైల్స్‌లో అన్ వెరిఫైడ్ ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చెయ్యొద్దు.

  • ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ వంటి రిమోట్ అప్లికేషన్లు డౌన్ లోడ్ చెయ్యొద్దు. ఓపెన్, పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను వాడొద్దు. పబ్లిక్ ప్రదేశాల్లో యూఎస్‌బీ పోర్టులతో ఛార్జింగ్ పెట్టొద్దు.

  • పార్ట్ టైం జాబ్స్ / వర్క్ ఫ్రం హోం అని వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దు. స్టాక్స్ / ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టే ముందు నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫారంల పట్ల జాగ్రత్త వహించాలి.


సైబర్ క్లీనింగ్ కోసం..



  • మీ బ్యాంక్ అకౌంట్ అప్లికేషన్లు, సోషల్ మీడియా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు వాటిని మారుస్తూ ఉండాలి.

  • సోషల్ మీడియా ఖాతాల్లో డేటా ప్రైవసీ సెట్టింగ్స్ ఉపయోగించి ప్రైవేట్‌గా ఉంచుకోవాలి. వాడని సమయంలో మీ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు లాక్ చేయాలి.

  • మీ ఆన్ లైన్ ఖాతాల్లో టు ఫ్యాక్టర్ అథంటికేషన్ (2FA) ఎనేబుల్ చేయాలి. మొబైల్‌లో యాప్స్ ఇన్ స్టాల్ చేసేటప్పుడు కాల్స్, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, మీడియా, లొకేషన్లకు యాక్సిస్ అనుమతించే ముందు ఓసారి చెక్ చేసుకోవాలి.

  • మీరు ఎవరికైనా డబ్బులు పంపిస్తే యూపీఐ పిన్ అవసరం. అదే మీ ఖాతాలోకి ఎవరైనా డబ్బులు పంపించాల్సి వస్తే పిన్ అవసరం లేదు.

  • అలాగే, డిజిటల్ అరెస్టులు అంటూ ఎవరైనా కాల్స్ చేస్తే నమ్మొద్దు. దేశంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదు. 

  • ఒకవేళ, సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేయాలి. తద్వారా వెంటనే డబ్బులు రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది.


Also Read: KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?