Telangana News: వానా కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని కళ్లల్లో వత్తులేసుకొని చూసిన అన్నదాతలకు.. కాస్త ఆలస్యమైనా వరుణ దేవుడు కరుణించాడు. ఎట్టకేలకు వర్షాలు పడుతుండడంతో నారు మడులు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. సాధారణంగా మే మూడో వారంలోనే నారు పోయడం, తర్వాత నెల రోజులకు నాట్లు వేయడం అందరూ చేసే పనే. కానీ ఈసారి నైరుతి రుతు పవనాల రాక కాస్త ఆలస్యం అవడంతో.. జూన్ నాలుగో వారంలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నార్లు పోశారు.
గత వారం రోజుల్లోనే దాదాపు 30 శాతం వరినార్లు పూర్తి అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సాగునీరు అందుబాటులో ఉన్న రైతులు ఇప్పటికే నారు సిద్ధం చేసుకోగా... మరో వారం, పది రోజుల్లో నాట్లు మొదలు పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. సీజన్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ వర్షాకాలంలో 120 రోజుల కంటే తక్కువ సమయంలో పండే స్వల్ప కాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ మేరకే కూనారం సన్నాలు, కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ఎస్ఆర్ 21278, ఆర్ఎస్ఆర్ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా, ఎంటీయూ 1010, జగిత్యాల 24423, ఐఆర్ 64, హెచ్ఎంటీ సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలనే అధిక శాతం రైతులు నారు పోశారు. మరోవైపు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, విత్తనాలు నాే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో నేడు వర్షాలు
ఈ రోజు అల్పపీడనం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, పరిసరాలలోని దక్షిణ జార్ఖండ్ & ఉత్తర ఛత్తీస్ గఢ్ వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు, రేపు కొన్ని చోట్ల ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు రాష్ట్రంలో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 80 శాతంగా నమోదైంది.