Telangana Latest News: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం నిర్ణయించారు. రేపు (నవంబర్ 9) గురువారం నాడు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ముందు ఉదయం 11 గంటలకు గజ్వేల్ లో నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి హెలికాప్టర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
హరీశ్ రావు కూడా రేపే
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా రేపు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు. తెలంగాణలోని అందరు ఎమ్మెల్యేల్లో హరీశ్ రావు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. సీఎం కేసీఆర్ తర్వాత సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి హరీశ్ రావు 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్లతో గెలిచారు. 2010 మొదట్లో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశారు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93,328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. హరీష్ రావుకు ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం 2021, నవంబరు 9న బాధ్యతలు చేపట్టారు. 2023 లో జరిగే ఎన్నికలకు సిద్దిపేట అభ్యర్థిగా ఆగస్టు 21న మరోసారి ప్రకటించారు. రేపు గురువారం రోజున ఉదయం 11:30 తరవాత నామినేషన్ వేయనున్నారు.