Telangana News :  తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. ఏకాభిప్రాయం రాకపోవడమే కారణమని  భావిస్తున్నారు. పలు డిజైన్లు పరిశీలించినప్పటికీ  సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయలేదు. చివరికి సంప్రదింపులు కొనసాగిస్తూ.. చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేయాలని నిర్ణయించారు. రెండో తేదీన కేవలం తెలంగాణ గేయాన్ని మాత్రమే ఆవిష్కరించే అవకాశం ఉంది.  ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా రూపొందించాలని రేవంత్ భావిస్తున్నారు.  ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారని స్పష్టమయింది. వీటిని రేవంత్ రాచరిక పోకడలుగా చెబుతున్నారు. 


చిహ్నం మార్పు చేయాలన్న నిర్ణయంపై దుమారం                    


తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర దుమారం రేపుతున్నాయి. అందుకే  సీఎం రేవంత్ రెడ్డి నష్టనివారణ చర్యలు చేపట్టారు. రాష్ట్ర చిహ్నం, గీతాలపై మార్పులు, చేర్పులకు గల కారణాలను అన్ని పార్టీలకు వివరించాలని అనుకుంటున్నారు.  పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను సచివాలయానికి ఆహ్వానం పంపారు.   ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం స్ఫూరించేలా కొత్త చిహ్నం రూపొందించామని… ఎవరినో కించపర్చడానికి మార్పులు చేపట్టలేదని వివరించే అవకాశం ఉంది. అయితే ఖరారు చేసిన తర్వాత తమను పిలిచి ఉపయోగం ఏమిటని రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నించే అవకాశం ఉండటంతో చిహ్నం ఖరారును వాయిదా వేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్                        


మరో వైపు ఈ మార్పులను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  హైదరాబాద్‌ ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తుందని అందుకే చిహ్నాల మార్పు అని  కేటీఆర్ ఆంటున్నారు.  కేసీఆర్‌ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. హస్తం పార్టీ రాజకీయ కక్షతోనే మార్పు చేస్తోందని విమర్శిస్తున్నారు.  చార్మినార్‌ను తొలగిండం అంటే హైదరాబాదీలను విమర్శించడమేనని వ్యాఖ్యానించారు. కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే మూర్ఖపు నిర్ణయమేనని అన్నారు. దీనిని వెనక్కి తీసుకోకపోతే నిరసనలు చేస్తామని, ఈ విషయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని  ప్రకటించారు.  


హైదరాబాద్ చరిత్రను కనుమరుగు చేసే కుట్రన్న కేటీఆర్                             


చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని కేటీఆర్ అన్నారు. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని ఆరోపించారు. మరోవైపు కాకతీయ కళాతోరణం తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వరంగల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ వివాదం పెరుగుతూండటంతో.. చిహ్నం ఆవిష్కరమ వాయిదా వేయడం బెటరని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.