Telangana Municipality Voters: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఎన్నికల సంఘం దాదాపుగా పూర్తిచేస్తోంది. ఓటర్ల వివరాలను దాదాపుగా ఫైనల్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 123 మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఈ గణాంకాల ప్రకారం, మొత్తం 2,996 వార్డుల్లో కలిపి 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. గతంతో పోలిస్తే పట్టణ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం.
మున్సిపల్ ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 123 మున్సిపాలిటీలకు గానూ ఏకంగా 113 మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఓటర్లలో 51.1 శాతం మంది మహిళలు ఉండగా, వీరి సంఖ్య 26,80,014 గా ఉంది. పురుష ఓటర్లు 25,62,369 (48.9 శాతం) ఉండగా, ఇతరులు 640 మంది ఉన్నారు. పట్టణ ఓటర్ల జాబితాను నిశితంగా గమనిస్తే, పురుషుల కంటే మహిళలు దాదాపు 1.17 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. కేవలం 10 మున్సిపాలిటీల్లో మాత్రమే పురుష ఓటర్లు ఆధిక్యంలో ఉండగా, మిగిలిన చోట్ల మహిళలే నిర్ణాయక శక్తిగా మారనున్నారు. ఈ గణాంకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యూహాలను మార్చే అవకాశం ఉంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ అధికారిక గణాంకాలు పట్టణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన అధికారులు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణాయక శక్తిగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు మరియు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఫిబ్రవరి లేదా మార్చి లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన గణన ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే, జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఎప్పుడో ముగిసింది. ప్రస్తుతం స్పెషల్ ఆఫఈసర్ల పాలనలో ఉన్నాయి.