Telangana Municipal Elections Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విచిత్రాలు.. ఓటర్ స్లిప్పుల్లో ప్రభుత్వానికి వినతిపత్రాలు, డిమాండ్లు
Ballot Box Letters తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల సందర్భంగా చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓచోట గడ్డపారతో తాళం పగలగొట్టగా, మరోచోట గుర్తుపై అభ్యర్థి లేడని మరో అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు.

Telangana Municipal Elections Results 2026 | హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు వేళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచేందుకు సిద్ధమవ్వగా, ఆ గదికి సంబంధించిన తాళం చెవి కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది. లెక్కింపు సమయం మించిపోతుండటం, అభ్యర్థులు, ఏజెంట్లు ఎదురుచూస్తుండటంతో అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. తాళం కోసం వెతకడం మానేసి, చివరకు గడ్డపారతో స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని పగలగొట్టి బ్యాలెట్ బాక్సులను బయటకు తీశారు. ఈ ఘటన లెక్కింపు కేంద్రంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'మేము చనిపోక ముందే మా డబ్బులు ఇవ్వండి'.. ఓటర్ స్లిప్పులు
Breaking news
— PulseNewsBreaking (@pulsenewsbreak) February 13, 2026
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ స్ట్రాంగ్ రూం కీ మిస్సింగ్
గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళం పగలగొట్టిన అధికారులు pic.twitter.com/r9hiIFIVQV
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులకు కంటతడి పెట్టించే సంఘటనలు ఎదురవుతున్నాయి. ఓట్ల కోసం వేసిన బ్యాలెట్ బాక్సుల్లో ఈసారి ఓటర్ల నిరసన జ్వాలలు, ఆవేదనతో కూడిన లేఖలు ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా 35వ వార్డు బ్యాలెట్ బాక్సును తెరిచిన అధికారులకు ఒక లేఖ కనిపించింది. అందులో రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసుకున్న విన్నపం అందరినీ కలచివేస్తోంది.

ఆ లేఖలో.. "ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మేము రిటైర్ అయ్యి 15 నెలలు గడుస్తున్నా మాకు రావలసిన బెనిఫిట్ డబ్బులు ఇంకా అందలేదు. వయసు మళ్లిన మేము అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. కనీసం మేము చనిపోక ముందే మా సొంత డబ్బులు మాకు ఇప్పించండి" అంటూ రిటైర్డ్ అధికారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ జీవితకాలపు సంపాదన కోసం ప్రభుత్వం చుట్టూ తిరగలేక, చివరకు ఎన్నికల బ్యాలెట్ బాక్సునే తమ నిరసన తెలపడానికి వేదికగా మార్చుకున్నారు. ఓట్లు లెక్కించడానికి వచ్చిన అధికారులు, ఏజెంట్లు ఈ లేఖలోని సారాంశాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. పెన్షన్లు, బకాయిల కోసం వృద్ధులు పడుతున్న ఈ ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భైంసా కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం: అభ్యర్థి లేని గుర్తుపై ఏజెంట్ల ఆగ్రహం
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న సమయంలో 23వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో ఒక వింత సమస్య వెలుగులోకి వచ్చింది. ఆ వార్డు బ్యాలెట్ పేపర్‌పై ఉంగరం (Ring) గుర్తు ఉంది, కానీ వాస్తవానికి ఆ వార్డులో ఉంగరం గుర్తుపై ఏ అభ్యర్థి పోటీలో లేరని పోలింగ్ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. అభ్యర్థే లేనప్పుడు ఆ గుర్తు బ్యాలెట్ పేపర్‌పై ఎలా వచ్చిందని వారు అధికారులను నిలదీస్తున్నారు.
ఈ పరిణామంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళంపై స్పష్టత వచ్చే వరకు కౌంటింగ్‌ను నిలిపివేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాము అభ్యర్థిస్తున్నా అధికారులు పట్టించుకోకుండా లెక్కింపును కొనసాగిస్తున్నారని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై నమ్మకం లేదని, ఈ పొరపాటు ఎన్నికల పారదర్శకతను దెబ్బతీస్తోందని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
సూర్యాపేట మున్సిపాలిటీ: ఓటర్ స్లిప్పుల్లో వినతిపత్రాలు
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులకు ఒక వింత అనుభవం ఎదురైంది. బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తున్న సమయంలో, కొన్ని బ్యాలెట్ పత్రాలతో పాటు ఓటర్ స్లిప్పులపై రాసిన వినతిపత్రాలు బయటపడ్డాయి. సాధారణంగా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి వదిలేస్తారు, కానీ ఇక్కడ కొందరు ఓటర్లు తమ నియోజకవర్గంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బ్యాలెట్ బాక్సులనే వేదికగా చేసుకున్నారు. రోడ్డు విస్తరణ పనుల పరిహారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది.
























