Liquor Shops Closed: తెలంగాణలో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్లు బంద్.. ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు
Liquor Shops and Bars in Telangana | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రెండు రోజులపాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Telangana Municipal Elections 2026 | హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు మద్యం దుకాణాల బంద్‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని మున్సిపాలిటీల పరిధిలోని వైన్స్, బార్లను 2 రోజుల పాటు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను ఆ ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ బంద్
అంతేకాకుండా, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే ఫిబ్రవరి 13వ తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల అధికారులు, ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలు
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని రోజుల కిందట నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు (కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ) కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలలో 2,996 వార్డులకు ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.
సోమవారం ముగియనున్న ప్రచారం..
ఎన్నికల నిబంధనల ప్రకారం, పోలింగ్ ప్రారంభమయ్యే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది కనుక, ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ప్రచారం ముగించాలి. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా మెజార్టీ స్థానలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి.
మహిళలకు సగం సీట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించేలా కాంగ్రెస్ ప్రభుత్వం, పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేశాయి. మొత్తం వార్డులలో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించడం ఈ రిజర్వేషన్లలో అత్యంత కీలకమైన అంశం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వారి జనాభా ప్రాతిపదికన నిర్ణయించగా, బీసీలకు 34 శాతానికి మించకుండా రిజర్వేషన్లు కల్పించారు. మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులకు సంబంధించి కూడా ఇదే నిష్పత్తిని పాటిస్తూ లాటరీ పద్ధతి ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేశారు.
వార్డుల విభజన, ఓటర్ల జాబితా ఆధారంగా ఏయే వార్డు ఏ వర్గానికి కేటాయించారో ఇప్పటికే జిల్లా గెజిట్లలో ప్రచురించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా కుల గణన డేటాను కూడా ప్రామాణికంగా తీసుకున్నారు.
























