Telangana Municipal Elections: త్వరలో వారికి సైతం ఇందిరమ్మ ఇళ్లు, స్థలం లేకున్నా సరే- భట్టి విక్రమార్క
Indiramma housing scheme | తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తోందని, త్వరలో మున్సిపాలిటీల్లోని పేదలకు సైతం వర్తింపజేస్తామని భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.

Bhatti Vikramarka Good News for Urban Poor | మధిర: తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో శనివారం నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విజయవంతంగా కొనసాగుతోందని, త్వరలోనే ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు (మున్సిపాలిటీలకు) కూడా విస్తరిస్తామని శుభవార్త చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అమలు తీరు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదల కోసం సుమారు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. దశలవారీగా లబ్ధిదారులకు నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ఇకనుంచి పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సొంత స్థలం కలిగిన వారికి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తామని, స్థలం లేని నిరుపేదల కోసం ప్రభుత్వమే జి ప్లస్ 2 (G+2) తరహాలో ఇల్లు నిర్మించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

మధిర అభివృద్ధే లక్ష్యం
తన రాజకీయ ప్రస్థానంలో మధిర నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. మధిర అంటే తనకు ప్రాణం అని, ఇక్కడి ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే అని భావోద్వేగంగా మాట్లాడారు. మధిర ప్రజలు వరుసగా నాలుగు సార్లు తనను శాసనసభ్యుడిగా గెలిపించడం వల్లే, నేడు తాను ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని కృతజ్ఞతలు తెలిపారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, భవిష్యత్ తరాలకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని భట్టి పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను చక్కదిద్దుతూనే, సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
























