KTR Birthday Celebration: జూలై 24వ తేదీ అంటే ఈరోజు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు యూసుఫ్ గూడలోని స్టేట్ హోమ్‌లో 10, 12 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన 47 మంది విద్యార్థులకు వ్యక్తిగతంగా చేయూత ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 'గిఫ్ట్ ఎ స్మైల్' కింద ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న మరో 47 మంది పిల్లలకు కూడా మద్దతుగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. ట్విట్టర్ వేదికగా తన ప్లాన్ వివరించారు కేటీఆర్. ప్రతీ ఒక విద్యార్థికి ల్యాప్ టాప్ తో పాటు రెండేళ్ల కోచింగ్ ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. తన పుట్టిన రోజు నాడు ప్రకటనలపై డబ్బు ఖర్చు పెట్టడం కంటే అనాథ పిల్లలకు సాయం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. తమ కలల సాకారం కోసం నిత్యం పరితపిస్తున్న విద్యార్థులే రాష్ట్ర సంపద అని వెల్లడించారు.
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ పాయింట్ వద్ద కేక్ ను కట్ చేశారు. అనంతరం సైక్లింగ్ స్పోర్ట్స్ మీట్ ను చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నీరా కేఫ్ లో.. రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ సభ్యులు కే. కిషోర్ గౌడ్, అర్జున అవార్డు గ్రహీత అనూప్, మాజీ చైర్మన్ జి. శ్రీనివాస్ యాదవ్, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ, మర్రి లక్ష్మారెడ్డి, ప్రేమ్ రాజ్, క్రీడాకారులతో కలిసి ఆరోగ్య ప్రదాయిని నీరాను త్రాగారు. నీరాలో ఉన్న ప్రకృతి సిద్ధమైన ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మంచివని తెలిపారు. నీరా కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా కాపాడుతుందనీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వివారించారు.
బీఆర్ఎస్ పార్టీ నేత అలిశెట్టి అరవింద్.. మంత్రి కేటీఆర్ కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు 45 అడుగుల వెడల్పు కలిగిన భారీ బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్ సారథ్యంలో సాధించిన విజయాలను వివరిస్తూ రాసి ఉన్న పోస్టర్ ను కట్టారు. టీ హబ్, దుర్గం చెరువు ఫ్లైఓవర్, టీ వర్క్స్, నగరంలోని పలు ఫ్లైఓవర్లను ఇందులో పొందుపరిచారు. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వాహనం పది రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో సంచరిస్తుంది. మాటల్లో కాదు అతి తక్కువ కాలంలో అభివృద్ధిని చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు అలిశెట్టి పేర్కొన్నారు.