Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రెజ్లర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని సూచించారు. వారికి మనందరం గౌరవం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. నెల రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రెజ్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి.
బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ గతంలోనూ నినదించారు. అయినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. పోలీసుల తీరుని నిరసిస్తూ మరోసారి నిరసన వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఇంకా FIR నమోదు కాలేదు. ఈ నిర్లక్ష్యంపై రెజ్లర్ వినేష్ ఫోగట్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులపై మండి పడ్డారు. వినేష్ ఫోగట్‌తో పాటు బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. జనవరిలోనూ దీనిపై నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం ఈ కేసుని విచారించేందుకు ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. ఇప్పటి వరకూ ఆ రిపోర్ట్ విడుదల చేయలేదు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బజ్‌రంగ్ పునియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. "బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు" అని వెల్లడించారు.