రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా 100 సీట్లు సాధిస్తుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లోనూ హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభించారని, ఆయనకు హుస్నాబాద్ అంటే ఓ ప్రేమ, నమ్మకం అని అన్నారు.
ప్రతిపక్షాలు వణుకుతున్నాయి
బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు వణుకుతున్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాటిస్తే తప్పకుం డా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని అన్నారు. ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం పచ్చని పొలాలతో అలరారుతోందని చెప్పారు. హుస్నాబాద్ కు కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నీళ్లు తెచ్చి సస్య శ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని హరీష్ కొనియాడారు.
హ్యాట్రిక్ విజయం అందించాలి
హుస్నాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ బాబును గెలిపించి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ గా అందించాలని హరీష్ రావు అక్కడి ప్రజలను కోరారు. సతీష్ బాబు అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన ప్రజల మనిషి అని, నిత్యం అందుబాటులో ఉంటూ మచ్చ లేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.
తెలంగాణ భవితకు భరోసా
అంతకు ముందు సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ భవితకు బీఆర్ఎస్ మేనిఫెస్టో భరోసా అని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన, కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా వస్తుందని పేర్కొన్నారు. సౌభాగ్య లక్ష్మితో ప్రతి మహిళకు కేసీఆర్ అన్నగా మారారని, తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించనున్నారని చెప్పారు.
ప్రజల మేనిఫెస్టో
బలహీన వర్గాలను ఆదుకునేలా పింఛన్లు పెంపు, పేద మహిళలకు భృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో రూపొందించిన ఈ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని హరీష్ రావు ప్రశంసించారు. అగ్ర వర్ణ పేద విద్యార్థులకు గురుకులాల్లో అత్యుత్తమ విద్య అందించేలా కేసీఆర్ చర్యలు చేపడతారని వివరించారు. రైతు బంధు పెంపుతో అన్నదాతల్లో కొండంత ధైర్యం నింపారని కొనియాడారు.
ఇవ్వని హామీలూ అమలు
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ఈ హామీలను వంద శాతం అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. ఈ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు నిరాశలో మునిగిపోయాయని పేర్కొన్నారు. కేసీఆర్ విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా హామీలు అమలులో చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ఈ మేనిఫెస్టోతో బీఆర్ఎస్ కచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రికార్డు సృష్టించడం ఖాయమని స్పష్టం చేశారు.