Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
News Coins Bike Purchase: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగు చూసింది. ఏకంగా రూ.1.10 లక్షల విలువైన బైక్‌ను కేవలం 10 రూపాయల నాణేలతో కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒక యువకుడు.

10 Rupee Coin Validity Rumors: రూ.50 లేదా రూ.100 చిల్లర నాణేల రూపంలో ఇస్తేనే.. "అబ్బా! ఈ చిల్లర అంతా ఎవరు తీసుకుంటారు? అంటూ ముఖం ముడుచుకునే రోజులివి. అలాంటిది ఏకంగా రూ.1.10 లక్షల రూపాయల విలువైన కొత్త మోటార్ సైకిల్‌ను.. కేవలం 10 రూపాయల నాణేలను మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే వింతగా ఉన్న ఈ ఆసక్తికరమైన ఘటన తెలంగాణలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక యువకుడు తన కలల బైక్‌ను సొంతం చేసుకోవడానికి ఈ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే యువకుడు చాలా కాలంగా ఒక బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. అయితే, మార్కెట్లో 10 నాణేల చలామణిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు, తనదైన శైలిలో బైక్ కొనాలని ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున కేవలం 10 రూపాయల నాణేలను మాత్రమే సేకరించడం ప్రారంభించాడు. అలా మొత్తంగా రూ.1.10 లక్షల విలువైన పది రూపాయల నాణేలను సంచులలో నింపి సిద్ధం చేసుకున్నాడు.
VIDEO | A man from Telangana’s Yadadri-Bhuvanagiri district grabbed attention by purchasing a bike after paying the entire amount of Rs 1.10 lakh in Rs 10 coins.
— Press Trust of India (@PTI_News) July 8, 2026
Konde Raghupathi, a resident of Veliminedu village in Chityala mandal, bought a Splendor Plus motorcycle from Sri… pic.twitter.com/OY7gN0jajD
రఘుపతి ఈ భారీ కాయిన్స్ మూటలతో చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌కు చేరుకున్నాడు. తనకు నచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్‌ను సెలెక్ట్ చేసుకుని నేరుగా తన వెంట తెచ్చుకున్న కాయిన్స్ సంచులను కౌంటర్‌పై పెట్టాడు. రఘుపతి నాణేల సంచులతో షోరూమ్‌కు రాగానే అక్కడి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతటా నాణేల గుట్టలు చూసి, వాటిని లెక్కించడానికి షోరూమ్‌లోని నలుగురైదురు సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. మొదట షోరూమ్ నిర్వాహకులు అంత చిల్లరను చూసి కాస్త సంకోచించినప్పటికీ, ఆ నాణేలన్నీ లీగల్ కరెన్సీయే కావడంతో వాటిని స్వీకరించడానికి అంగీకరించారు. కాయిన్స్ అన్నీ లెక్కబెట్టి, లెక్క సరిచూసుకున్న తర్వాత రఘుపతికి బైక్ కీలను అందజేశారు.
ఈ అసాధారణ కొనుగోలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు రఘుపతి ఓపికను, ప్లానింగ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మార్కెట్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 రూపాయల నాణేలను చెల్లించేటప్పుడు కొందరు వ్యాపారులు నిరాకరిస్తున్న తరుణంలో.. ఆ నాణేలు పూర్తిగా చెల్లుతాయని, ఆ కరెన్సీతో లక్షల విలువైన లావాదేవీలు కూడా చేయవచ్చని రఘుపతి ప్రాక్టికల్‌గా నిరూపించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి యాదాద్రి యువకుడి 'కాయిన్ పవర్' టాలీవుడ్ సస్పెన్స్ సినిమా రేంజ్‌లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు






















