Mynampally Hanumanth Rao: ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంప్లలి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. అయితే ఈనెల 27వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతారని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ రెండు అసెంబ్లీ సీట్ల విషయం సర్వే రిపోర్ట్ ఆధారంగా ఇవ్వమని అడిగినట్లు పేర్కొన్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా మల్కాజిగిరి, మెదక్ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసారని మీడియాకు వివరించారు. తన సన్నిహితుడు నక్కా ప్రభాకర్ గౌడ్ కు మేడ్చల్ అసెంబ్లీ సీట్ గురించి రిక్వెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం రోజు కాంగ్రెస్ నేతలు ఆయన నివాసానికి క్యూ కట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ తదితరులు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి చేరుకున్నారు. ఈక్రమంలోనే ఆయనతో చర్చించగా.. మైనంపల్లి పార్టీలో చేరేందుకు ఒప్పుకున్నారు.

  


మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటున్న మైనంపల్లి


మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేయబోతున్నట్లు శనివారమే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి రెండు నియోజక వర్గాల నుంచి తాను పోటీ చేస్తానని చెప్పిన మాటల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను మల్కాజిగిరి నియోజక వర్గం నుంచి మాత్రమే పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈక్రమంలోనే కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు దూల పల్లిలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. శుభాకాంక్షలు చెబుతూ తెగ సందడి చేశారు. ఆయనతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కుత్బుల్లాపూర్ టి పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి.. మైనంపల్లి హనుమంతరావును మర్యాద పూర్వకంగా కలిశారు. వారి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగానే మైనంపల్లి హనుమంత రావు మాట్లాడుతూ.. తనకు పదవులు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని అన్నారు. అవసరం అయితే కార్యకర్తల కోసం ప్రాణ త్యాగానికి అయినా వెనుకాడబోనని చెప్పారు. తన కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 


బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి


కొంతకాలంగా బీఆర్ఎస్‌ లో రెబల్‌గా మారిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరిన ఆయన.. తన సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి సహా, తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కోసం మెదక్ స్థానం ఇవ్వాలని కోరారు. అందుకు అధిష్ఠానం ఒప్పుకోలేదు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన తొలి విడత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిజానికి అంతకు ముందే మైనంపల్లి రెబల్ గా మారినప్పటికీ, అభ్యర్థుల ప్రకటనలో ఆయన పేరును తొలగించలేదు. తర్వాత తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని భావించిన ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.