Telangana Liberation Day: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పెల్లి పోరాటానికి మారుపేరుగా మారింది. ఆంధ్ర మహాసభ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి సొంతూరు ఇల్లంతకుంట. ఆయన నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఉద్యమకారులు సమీప గ్రామాలకు చెందిన ముఖ్య నేతలంతా ఇక్కడే తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజాం పోలీసులు.. దాదాపు 500 మంది ఊరిని చుట్టుముట్టారు. ఈ విషయాన్నిగమనించిన ఊరి జనం గ్రామ శివారులో కందెనకుంట చెరువు దగ్గర నిజాం పోలీసులకు అడ్డుతగిలారు. నిరాయుధులైన వేలాది మంది తమ నాయకులకు రక్షణగా పోరు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన నిజాం పోలీసులు గ్రామస్థులపై కాల్పులు జరిపారు. పది మంది అక్కడికక్కడే చనిపోగా చాలామంది రక్త గాయాలతో తల్లడిల్లారు. అయినా ఆగకుండా గ్రామంలోకి చొరబడ్డ నిజాం పోలీసులు.. బద్దం ఎల్లారెడ్డి, మల్లుగారి బలరాం రెడ్డి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇదే వరుసలో ఉన్న పలు ఇళ్లు కాలి పోవడంతో పాటు ఆ ఊరి జనాలను చిత్ర హింసలు పెట్టారు.




తూటాలు తగిలిన వారిని జైల్లో బంధించిన నిజాం పోలీసులు..


తుపాకీ తూటా తగిలి గాయపడిన మల్లు గారి రాఘవరెడ్డి, బద్ధం వెంకయ్యలతోపాటు కొందరిని పోలీసులు తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెట్టారు. ఈ గ్రామానికి చెందిన మంగలి బుర్రయ్య, బోనింగవగారి నారాయణ, పీసు బక్కయ్య, పుల్లు గారి ఎల్లయ్య, పెరంబదూరి అనంతయ్య లతోపాటు యాల్ల రామిరెడ్డి, ఏలేటి రాజిరెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి,అల్లె వెంకయ్యలు తుపాకి తూటాలకు మరణించారు. నిజాం పోలీసులు రజాకార్ల అరాచకాలు ఎక్కువ అవుతున్న సమయంలో జిల్లాలోని ప్రతి పల్లె పోరాట పటిమను పలు రకాలుగా చూపించింది. అప్పటికే సిరిసిల్ల కేంద్రంగా 1935లో నిర్వహించిన ఆంధ్ర మహాసభ విజయవంతం కావడంతో పోరాటాన్ని ముందుండి నడిపించేందుకు జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, పి.వి.నరసింహారావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, సీహెచ్ రాజేశ్వర రావు, అనభేరి ప్రభాకర రావు, అమృత లాల్ శుక్లా, హనుమంతరావు ఇలా వందల సంఖ్యలో నాయకులు ముందుండి నడిపించారు.




కాళ్లకు సంకెలు వేసి కరీంనగర్ వీధుల్లో తిప్పారు..


1946 నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఊరూరా ఉద్రిక్తత పరిస్థితి ఉండేది. సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, కోనరావుపేట, ధర్మపురి, జగిత్యాల, భీమదేవర పల్లి గ్రామాలు రక్తంతో తడిసి పోయాయి. నిజాం పోలీసులు రజాకార్ల అరాచకాలు ఎక్కువవుతున్న సమయంలో ఊళ్ల మీద పడి సానుభూతి పరులను హింసించడం, దోపిడి తోపాటు అరాచకాలు చేసేవారు. వారిని ఎదుర్కొనేందుకు ఊరూరా జనం బలాన్ని చూపించారు. బద్దం ఎల్లారెడ్డిని నిజాం సైన్యం అరెస్టు చేసి నాలుగేళ్లు వరంగల్ జైల్లో నిర్బంధించింది. చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి సిరిసిల్ల, కరీంనగర్ వీధుల్లో నడిపించారు. రాజేశ్వరరావును చంచల్ గూడా గుల్బర్గా జైల్లో నిర్బంధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న పీవీ నరసింహారావు సహా జిల్లాకు చెందిన అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించింది. 




రక్తంతో తడిసిన గాలిపెల్లి..


1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నిజాం పాలనలో ఉన్న ప్రాంతానికి స్వేచ్చగా గాలి పీల్చుకునే అవకాశం రాలేదు. ఇక్కడ జెండాను ఎగుర వేయనివ్వలేదు. కరీంనగర్, ధర్మపురి, కోనరావుపేట లో కొందరు ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మపురిలో కేవీ కేశవులు సంఘనపట్ల మాణిక్యశాస్త్రి వారి కట్టుబాట్లు ఎదిరించి ధైర్యంగా జెండాను ఎగురవేశాడు. 1947 ఆగస్టు 19న గాలిలో బద్దం ఎల్లారెడ్డి నేతృత్వంలో 12 వేల మంది జాతీయ జెండాను ఎగురవేసి ఎగరవేసి స్ఫూర్తిని చాటారు. ఆ మరుసటి నెలలోనే సెప్టెంబర్ 14న నిజాం పోలీసులు గాలిపెల్లి ని రక్తంతో తడిపారు.