JP Nadda Speech At Nagarkurnool Meeting: ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనతో అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని, దేశం ఎంతగానో  అభివృద్ధి  చెందిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చి సహకరించామని తెలిపారు.  తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని వారికి నివాళి అర్పించారు. కానీ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ సామర్థ్యం నాశనం అయిందంటూ మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ నేతల జేబులు నింపుతున్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.


నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ నవ సంకల్ప సభ సమావేశం (Nava Sankalpa Sabha at Nagarkurnool)లో జేపీ నడ్డా మాట్లాడుతూ.. జోగులాంబ శక్తి పీఠానికి, ఉమామహేశ్వరం, కృష్ణా నదికి నమస్కరించి ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేస్తే కానీ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత మాత్రమే రాష్ట్ర ఏర్పాటుతో లబ్ది పొందారని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ వికాసం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం పాటుపడిందన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనతో దేశం ఎన్నో రంగాల్లో ముందుకెళ్లగా, అందులో తెలంగాణ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో వేసిన రోడ్లను మోదీ 9 ఏళ్ల పాలనలోనే నిర్మించారని చెప్పారు.


కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల ప్రజలకు రేషన్ అందిస్తోంది. 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ పప్పు ఇచ్చింది కేవలం మోదీ ప్రభుత్వమని గుర్తు చేశారు. యూరప్ ఖండం జనాభా కన్నా 5 రెట్ల మందికి మోదీ ప్రభుత్వం రేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. పేదవాడు ఆకలితో ఉండకూడదని 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందించిన ఘనత మోదీ సొంతమన్నారు. గతంలో పేదరికం 22 శాతం ఉంటే, మోదీ పాలనతో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని చెప్పారు. పేదవాడికి సొంతింటి కల సాకారం చేయడానికి 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు కట్టిస్తే 2.5 లక్షల ఇల్లు ఇచ్చిందన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆ ఇండ్లు తాము కట్టించామని గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. 


బడుగు బలహీన వర్గాలు, పేదలు, మహిళలు, యువత కోసం అహర్నిషలు శ్రమిస్తున్న సర్కార్ మోదీ ప్రభుత్వం అని జేపీ నడ్డా చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కూడా అవినీతి చేశారని ఆరోపించారు. దేశంలో 11 కోట్ల టాయి లెట్లు నిర్మిస్తే, తెలంగాణలో 21 లక్షల టాయి లెట్లు నిర్మించాం. ఇవి మహిళల ఆత్మ గౌరవం అన్నారు. మహిళలు, తన తల్లి కష్టాలు చూసి ఉజ్వల పథకం తీసుకొచ్చి 9 కోట్లకు పైగా లబ్ది పొందారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా స్కీమ్ అని కొనియాడారు. 


రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.6 వేలు నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నాం. తెలంగాణలో 48 లక్షల మంది రైతులు ఈ పథకంతో లబ్ది పొందుతున్నారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ మోదీ ముందుచూపుతో భారత్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దూసుకెళ్లింది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో భారత్ మోదీ పాలనతో 5వ స్థానానికి వచ్చిందన్నారు. 97 శాతం మొబైల్స్ ప్రస్తుతం భారత్ లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఆటోమొబైల్ మానుఫ్యాక్చరింగ్ లో 3వ స్థానంలో ఉన్నాం. మోదీ విదేశాలకు వెళ్తే ఆ దేశాల అధినేతలు మా బాస్, మా లీడర్ అంటూ మోదీని ప్రశంసిస్తున్నారు. కొందరు ఆయన కాళ్లకు నమస్కరించి అభిమానాన్ని చాటుకుంటున్నారని నడ్డా అన్నారు. 



మోదీని వ్యతిరేకించే పార్టీలు ఏకమయ్యాయి. కానీ కుల పార్టీలు కావాలంటే బిహార్ లో ఆర్జేడీ, వంశపారపర్య పార్టీలు కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. యూపీలో అఖిలేశ్ యాదవ్ కు, తెలంగాణలో కుటంబ పార్టీ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు పేరు మారింది కానీ అవినీతి మారలేదని, రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial