Telangana high Court verdit on Panchayat Elections | హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లుపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలైన పిటిషన్‌పై ఈ తీర్పు ఇచ్చింది. వెనుకబడిన కుల సంఘాలు (BC Group) గురువారం తెలంగాణ హైకోర్టులో ఎన్నికలపై స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ) రిజర్వేషన్లు కేటాయించాలని, అప్పటివరకూ ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.
బీసీ సామాజికవర్గంలో ఏ, బీ, సీ, డీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు ఇదివరకే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనందున, ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో మూడు దశలలో తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు.
12,733 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు..
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3దశల్లో జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికలు మొత్తం 545 మండలాలు, 12,733 గ్రామాల్లో జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకుంటారు. తొలి విడతకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 11న జరిగి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలై ఫలితాలు ప్రకటిస్తారు. రెండో, మూడో దశలు డిసెంబర్ 14, 17 తేదీల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొదటి దశలో 200 మండలాలు, రెండో దశలో 200 మండలాలు, మూడో దశలో మిగిలిన 145 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ప్రతి దశలో అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ముందే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల GO Ms 46 జారీ చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించింది. ఈ కేటాయింపులు కులాలు, జనాభా ఆధారంగా జరిగాయి, మహిళలకు 50% రిజర్వేషన్లు లాటరీ విధానంతో ఖరారు చేశారు.
రెండో దఫా: నామినేషన్ల స్వీకరణ – నవంబర్ 30 పోలింగ్ – డిసెంబర్ 14 (శనివారం)
మూడో దఫా: నామినేషన్ల స్వీకరణ – డిసెంబర్ 3 పోలింగ్ – డిసెంబర్ 17 (మంగళవారం)
మూడు దఫాల్లోనూ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎస్ఈసీ ప్రకటించారు.