Telangana High Court: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియాలో విపరీతంగా వరుసగా కథనాలు రావడంతో హైకోర్టు స్పందించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ధర్మాసనం ఈ కేసును సుమోటోగా స్వీకరించగా.. మంగళవారం (జూన్ 4) మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది.


ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మాజీ అధికారులు ప్రభాకర్ రావు, భుజంగ రావు, ప్రణీత్‌ రావు, తిరుపతన్న నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడానికి వీరు అందరూ కలిసి పలువురు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇటీవలే పోలీసుల వాంగ్మూలంలో భుజంగరావు ఒప్పుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.


ఇలా వరుసగా పత్రికల్లో వస్తున్న కథనాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో కూడా హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం ట్యాప్‌ చేసినట్లు భుజంగరావు చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో వాటిని కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్‌ అలోక్‌ అరాధే ధర్మాసనం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.