TS VROs G.O 121 :  తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 23 నెలల తర్వాత జీవో నెంబర్ 121 తీసుకువచ్చింది. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం లాటరీ ద్వారా వీఆర్వోలను వివిధ శాఖలకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.  వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. వీఆర్వోల సంఘం వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు  సీజే ఉజ్వల్ భూయాన్ స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  ఇప్పటికే 99 శాతం మంది వీఆర్వోలు విధుల్లో చేరారని, ఇంకా 56 మంది వీఆర్వోలు మాత్రమే ఇతర విభాగాల్లో చేరాల్సి ఉందని ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే 56 మంది వీఆర్వోల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు వెల్లడించింది. 


ఉన్నతాధికారుల ఒత్తిడి 


జీవో 121 ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, సీనియారిటీని కోల్పోతున్నామని వీఆర్వోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇతర శాఖలకు కేటాయించడం తగదన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 23 నెలల పాటు పోస్టులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వీఆర్వోల సంఘం తమ పిటిషన్ లో హైకోర్టుకు తెలిపింది. తమ హక్కులకు భంగం కలిగించేలా 121 జీవోను విడుదల చేయడం దారుణమని వీఆర్వో సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీఆర్వోలు. ఈ క్రమంలోనే వీఆర్వోలు హైకోర్టును ఆశ్రయించారు. 121 జీవోలో ఎలాంటి స్పష్టత లేదని, వీఆర్వోల భద్రత అంశాన్ని తేల్చకుండా కేటాయించిన విధుల్లోకి వెంటనే చేరాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వీఆర్వోలు ఆరోపించారు. 


తప్పుడు లెక్కలు 


121 జీవో ద్వారా బదిలీ అయిన వీఆర్వోలు వెంటనే తమ తమ శాఖల్లో రిపోర్ట్ చేయాలని అనేక రకాలుగా బెదిరింపులకు గురిచేసి వాట్సాప్ ల ద్వారా ఆర్డర్లు పంపించి బలవంతంగా బదిలీ ప్రక్రియను ముగించడానికి ప్రయత్నించారని వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఇష్టం లేకున్నా ఇతర శాఖలోకి కొంతమంది వెళ్లారన్నారు.  ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించి 98% వీఆర్వోలు ఇతర శాఖలో చేరారని చెప్పడాన్ని తెలంగాణ వీఆర్వోల జేఏసీ ఖండించింది. రెసిడెన్షియల్ ఆర్డర్ ను ధిక్కరించి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచి సీఎస్ 121 జీవోను జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సీఎస్ షాడో సీఎం 


"ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కలెక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి తన పంతాన్ని నెగ్గించుకోవడానికి జీవోలు జారీ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. తప్పుడు నివేదికలతో ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నటు వంటి సీఎస్ ను ఆ హోదా నుంచి తొలగించాలి. పరిపాలనలో ఎన్నడూ జరగని విధంగా సీఎస్ అన్ని హోదాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సీసీఎల్ఏగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సీఎస్ కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యోగుల మనోభావాలను అర్థం చేసుకోకుండా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులకు స్వేచ్ఛ లేకుండా ఉద్యోగ హక్కులను తుంగలో తొక్కుతున్నారు. కొంతమంది ఉద్యోగ నాయకులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ సీఎస్ఐ ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉద్యోగ సంఘాలను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తూ హక్కులను హరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఉద్యోగుల మనోభావాలను అర్థం చేసుకోలేని సీఎస్ సోమేశ్ కుమార్ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని వీఆర్వోల జేఏసీ డిమాండ్ చేస్తుంది" - వీఆర్వోల జేఏసీ ఛైర్మన్ గోల్కొండ సతీష్