Telangana High Court: మార్గదర్శి సంస్థకు చెందిన వ్యవహారాలన్నింటిని ఆడిట్ చేసేందుకు ప్రత్యేకంగా ఆడిటర్ ను నియమిస్తూ ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా శాఖ చిట్ లేక కొన్ని చిట్ గ్రూపుల గురించి కాకుండా మొత్తం కంపెనీ వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించాలనడాన్ని చట్టం అనుమతించదని పేర్కొంది. ప్రాథమిక నివేదిక, ఆడిటర్ ను నియమిస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్, ఆడిటర్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. అలాగే ఇరుపక్షాల వారు సమర్పించిన గత తీర్పులన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం.. మార్గదర్శి పిటిషన్ పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తేల్చి చెప్పింది. మార్గదర్శి డైరెక్టర్లకు ఆడిటర్ జారీ చేసిన నోటీసులతో పాటు గతంలో హైదరాబాద్ కార్యాలయంలో జరిపిన సోదాలన్నింటిని పరిధిలోకి తీసుకుంటూ పరిధి ఉందని పేర్కొంది. 


విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా..


అనుకూలమైన న్యాయస్థానాన్ని ఎంపిక చేసుకుంటున్నారన్న ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసి పుచ్చింది. ఇదే మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించి పిటిషనర్లు ఈ హైకోర్టును ఆశ్రయించారని, పలు పిటిషన్ లు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయని, అన్ని అంశాలపై హైకోర్టు తేల్చడం సబబుగా ఉంటుందని, అందువల్ల కేసు పూర్వాపరాలను పరిశీలిస్తామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రత్యేకంగా నియమితులైన ఆడిటర్ కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లుదాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను గతంలో మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్ తో పాటు జత చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు విచారణ నిమిత్తం ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మార్గదర్శి వ్యవహారాలపై ప్రైవేటు ఆడిటర్ నియామకంతోపాటు, ఆడిట్ నిర్వహించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 


ఎక్కడా ఫిర్యాదుల గురించి ప్రస్తావన లేదు..!


దీనిపై సుదీర్థ వాదనలు విన్న జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆడిటర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన రిజిస్ట్రార్ చిట్ ఫండ్ కంపెనీల్లో ఆడిట్ చేసే తనిఖీ అధికారులకు సాయం చేయడానికి గాను ఆడిటర్ సేవలను తీసుకుంటూ జనవరి 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయితే కోర్టు ముందు ఉంచిన ప్రాథమిక నివదికను ఆడిటర్ తనిఖీ అధికారుల ప్రమేయం లేకుండానే తనంతట తానే ఆడిట్ చేసినట్లు ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రాథమికంగా చూస్తే సెక్షన్ 61(4) కింద మార్గదర్శికి చెందిన వ్యవహారాలపై సాధారణ ఆడిట్ నిర్వహించడానికి రిజిస్ట్రార్ తన అధికారాలను నియమించవచ్చా లేదా అనే దానిపై సందేహాలు ఉన్నాయని, దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే ఈ వ్యవహారంపై ప్రాథమిక నివేదికలో గానీ, ఇతర ఉత్తర్వుల్లో గానీ ఫిర్యాదులు ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. చిట్ ఫండ్ కంపెనీల్లో తనిఖీకి సాయం చేయడానికి ఆడిటర్ ను నియమించినప్పటికీ, మార్గదర్శి మినహా ఏ ఇతర చిట్ ఫండ్ కంపెనీల్లో ఆడిట్ నిర్వహించలేదన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు.