Telangana High Court Rejects Mohan Babu Bail Petition: సినీ నటుడు మోహన్ బాబుకు (Mohanbabu) తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్దకు వెళ్లి జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు చర్యలు తీసుకుంటారా.? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇదీ జరిగింది

కాగా, గత 4 రోజులుగా మంఛు ప్యామిలీ వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్దకు కవరేజీకి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. తనను ప్రశ్నించిన ఓ జర్నలిస్టు మైక్ లాక్కొని అతనిపై దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో అందిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పీఎస్‌లో మోహన్‌బాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 118 కింద కేసు నమోదు చేశారు. అటు, అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన మోహన్‌బాబు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు.

జర్నలిస్టుకు క్షమాపణలు

మరోవైపు, తన నివాసం వద్ద జరిగిన ఘటనపై స్పందించిన మోహన్ బాబు.. క్షమాపణలు చెబుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ మేరకు సదరు మీడియా సంస్థకు లేఖ రాశారు. 'ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడంపై విచారం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను. వ్యక్తిగత కుటుంబ వివాదంగా మొదలై.. ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆ జర్నలిస్టు సోదరునికి బాధ కలిగించినందుకు నాకు కూడా బాధగా ఉంది. ఇది జరిగిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల 48 గంటలు ఆస్పత్రిలో చేరడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. నేను అతని సహనాన్ని అభినందిస్తున్నా. ఆ రోజు నా ఇంటి గేట్ విరిగిపోయి.. దాదాపు 50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. దీంతో నేను సహనం కోల్పోయాను. ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. నేను పరిస్థితిని అదుపు చేసే క్రమంలో ఓ జర్నలిస్టుకు గాయమైంది. అతనికి, అతని కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.' అని లేఖలో పేర్కొన్నారు.

సంచలన ఆడియో

అంతకు ముందు మీడియా ప్రతినిధిని కొట్టడంపై మోహన్ బాబు సంచలన ఆడియో విడుదల చేశారు. 'కుటుంబసమస్యల్లో బయట వాళ్లు జోక్యం చేసుకోవచ్చు. వందకు వంద శాతం కాకపోవచ్చు.. 95 నుంచి 96 శాతం కుటుంబాల్లో సమస్యల్లో ఉంటాయి. కొంత మంది ఉన్నవి లేనివి చెబుతూంటారు. ఇదంతా ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రజలు కూడా.. రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీవీల్లో వస్తున్నాయి..మీడియా, సోషల్ మీడియాలో వస్తోంది. ఆ రోజు నా బిడ్డ మనోజ్ కుమార్ గేటు తోసుకుని లోపలికి వచ్చాడు. పత్రికా సోదరులు నా ఇంటి ముందు నాలుగు రోజుల నుంచి వ్యాన్లు పెట్టుకుని ఉండటం ఎంత వరకు న్యాయం?. నేను అప్పటికి బయటకు వెళ్తున్నప్పుడు చెప్పాను.. నాకు కుటుంబసమస్యలు ఉన్నాయి.. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను.. దయచేసి నా ప్రైవసీని గౌరవించండి అని కోరారు. నేను ఎలాంటి వాడ్నో అందరికీ తెలిసు. నా హృదయంలోని ఆవేదన చెప్పనలవి కాదు. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలి ఉండవచ్చు. నేను దానికి బాధపడుతున్నా. అతనూ నాకు తమ్ముడే. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చిందో  అభిమానులు గుర్తించారు. ప్రజలారా మీరే చూడాలని ..నేను చేసింది న్యాయమా.. అన్యాయమా మీరో ఆలోచించాలి.' అని కోరారు.

Also Read: Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్