TS Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. 2016లో విడుదల చేసిన జీవో 16 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖలను ఆర్థికశాఖ కోరింది. ఈ పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ఆర్థిక శాఖ తెలిపింది. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. రాష్ట్రంలో ఉన్న 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రకటనతో
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. 80 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లతో పాటు 11 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తుంది. అర్హులైన ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 26, 2016లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లోనే ఓ మెమో కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత కొందరు రెగ్యులరైజేషన్ ప్రక్రియపై కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను 2021 డిసెంబర్ 7న హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కోరారు. ఆర్థికశాఖ పరిశీలన, ఆమోదం కోసం వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆయన పేర్కొన్నారు.
కోర్టు కేసులతో వాయిదా
తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. కానీ కోర్టు కేసులతో ఈ నిర్ణయం వాయిదా పడుతూవచ్చింది. గతేడాది డిసెంబరు 7న ఈ కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసేందుకు తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.