హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో టాటా బోయింగ్ 100వ అపాచీ ఫ్యూజ్ లేజ్ డెలివరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మినిస్టర్ కేటీఆర్ పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 100 అపాచీ హెలికాప్టర్ల ఫ్యూజ్ లేజ్ భాగాలను టాటా సంస్థ తయారు చేసింది.
అపాచీ ఫ్యూజ్ లేజ్ డెలివరీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మట్లాడారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. డీఆర్‌డీవో, బీడీఎల్, ఈసీఐఎల్, బీఈఎల్, హెచ్ఏఎల్ వంటి ఎన్నో సంస్థలకు హైదరాబాద్ నిలయంగా మారిందన్నారు. ఏరోస్పేస్ సరఫరా చైన్ కు హైదరాబాద్ అనుకూలంగా ఉందని చెప్పారు.
బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే మెరుగైన వసతులు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఆదిభట్ల, ఎలిమినేడులో డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేశామన్నారు. టీ హబ్ ద్వారా అనేక ఇన్నోవేషన్లు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కరోనా సమయంలో ఉత్పత్తిపై ప్రభావం పడకుండా సరైన చర్యలు అన్నీ తీసుకున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
రాష్ర్ట ప్రభుత్వం అభివృద్ధి విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనతో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో గత ఐదేళ్ళలో అపూర్వమైన వృద్ధిని తెలంగాణ సాధించింది. హైదరాబాద్‌లోని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం, ఎఫ్‌డీఐ ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్ 2020లో ప్రపంచంలో నంబర్ వన్ ర్యాంకు సాధించింది. ఏరోస్పేస్ రంగంలో మంచి వృద్ధి సాధించడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ 2018, 2020 సంవత్సరంలో బెస్ట్ స్టేట్ అవార్డును తెలంగాణకు ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్త మాట్లాడారు. బోయింగ్ కు టాటా ఏరోస్పెస్ లిమిటెడ్ ఒక ఉదాహరణ అని చెప్పారు. ఏరోస్పెస్ లో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. రెండు సంవత్సరాల్లో ఇండియాలో నాలుగు రేట్లు వ్యాపారం పెరిగిందని చెప్పారు. ప్రతిభ, సరైన మౌలిక సదుపాయలు వ్యాపారానికి అనుకూలమని చెప్పారు. ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమకు తెలంగాణ ఒక మంచి ప్రదేశమని సలీల్ తెలిపారు.
Also Read: Microsoft survey: భారత్‌లో పెరుగుతోన్న టెక్ మోసాలు.. మైక్రోసాఫ్ట్ సర్వేలో వెల్లడి