Azhar hopes are on new Telangana Governor: తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మాజీ క్రికెటర్ , ప్రస్తుత మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంల ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ కేబినెట్ పంపిన ఫైల్ ఇంకా రాజ్ భవన్ లోనే ఉంది. 

Continues below advertisement

 కొత్త గవర్నర్ నిర్ణయంపైనే అందరి దృష్టి                           

తెలంగాణలో గత నాలుగు నెలలుగా మొహమ్మద్ అజారుద్దీన్ ,  ప్రొఫెసర్ కోదండరాం లను ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో నామినేట్ చేసిన ఫైల్   రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో సాంకేతిక ,  న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరగగా, ఇప్పుడు కొత్త గవర్నర్ ఈ దస్త్రాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రభుత్వానికి కీలకంగా మారింది. సాధారణంగా కేబినెట్ సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించాల్సి ఉన్నప్పటికీ, గత అనుభవాలను దృష్ట్యా ఈసారి కూడా ఏదైనా  ట్విస్ట్  ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Continues below advertisement

 అజారుద్దీన్ మంత్రి పదవికి పొంచి ఉన్న ముప్పు?

అజారుద్దీన్ విషయంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఆయన ప్రస్తుతం శాసనసభలో కానీ, మండలిలో కానీ సభ్యుడు కాకుండానే అక్టోబర్ 31, 2025 న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం ప్రకారం, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఆయన ఏదో ఒక సభలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. ఒకవేళ కొత్త గవర్నర్ కూడా ఈ ఎమ్మెల్సీ నామినేషన్‌ను ఆమోదించకపోతే లేదా జాప్యం చేస్తే, గడువు ముగిసిన తర్వాత అజారుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.

 కోదండరాంపై న్యాయ వివాదాల నీడ

మరోవైపు, ప్రొఫెసర్ కోదండరాం  పేరు కూడా అనేక మలుపులు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం పేరును ప్రతిపాదించడంపై కోర్టుల్లో కేసులు నడిచాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఈ నియామకాలపై స్టే లేదని స్పష్టం చేసినప్పటికీ, గవర్నర్ సంతకం పెడితేనే అది అధికారికం అవుతుంది. ప్రభుత్వం తన మిత్రపక్ష నేత అయిన కోదండరాంను పెద్దల సభకు పంపడం ద్వారా కీలక రాజకీయ సందేశం ఇవ్వాలని భావిస్తోంది.

రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?                     

కొత్త గవర్నర్ ప్రభుత్వం పంపిన సిఫార్సులను యథాతథంగా ఆమోదిస్తే రేవంత్ రెడ్డి సర్కార్‌కు పెద్ద ఊరట లభిస్తుంది. ఒకవేళ గవర్నర్ మళ్ళీ ఏవైనా కొర్రీలు పెడితే మాత్రం, అది ప్రభుత్వం వర్సెస్ రాజ్‌భవన్ వివాదానికి దారితీయడమే కాకుండా, మైనారిటీ కోటాలో మంత్రిగా ఉన్న అజారుద్దీన్ పదవికి ఎసరు తెచ్చే అవకాశం ఉంది. మార్చి 19న సుప్రీంకోర్టులో ఈ విషయమై తదుపరి విచారణ ఉండటంతో, ఆలోపే గవర్నర్ నిర్ణయం వెలువడుతుందో లేదో వేచి చూడాలి.