Telangana News: గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు నిన్న ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ రోజు ఇద్ద‌రు మంత్రులు స‌మావేశ‌ం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీల్లో వివిధ ప‌నుల‌కు సంబంధించి నిధుల విడుదలపై చ‌ర్చించారు. రూ.1190 కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి వెంట‌నే ఆ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు. కాగా ఈ నిధుల‌ను విడుద‌ల చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్‌ల‌లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నిధులు విడుద‌ల కావ‌డంతో అభివృద్ధి ప‌నులు మ‌రింత వేగంగా జ‌ర‌గున్నాయి.


ఇదిలాఉండ‌గా స‌ర్పంచ్ ల సంఘం ప్ర‌తినిధులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెక‌ల్లి ద‌యాక‌ర్ రావుని హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో క‌లిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ నిధుల విడుద‌ల‌తో స‌ర్పంచ్ లలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, హ‌రీశ్ రావుల‌కు వారు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మ‌న‌సున్న మ‌హారాజు, మాట త‌ప్ప‌కుండా, అంద‌రి శ్రేయోభిలాషిగా ఆలోచిస్తున్నార‌ని.. అందుకే ప‌ల్లెల్లో ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నిధులు విడుద‌ల చేస్తూ అభివృద్ధిని నిరాటంకంగా కొన‌సాగిస్తున్నార‌ని చెప్పారు.