Local body Elections 2025 In Telangana | తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం తన సన్నాహాలను వేగవంతం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవోను విడుదల చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు కీలక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఓటర్ల జాబితా, ఎన్నికల భద్రత వంటి అంశాలపై చర్చ జరగనుంది.
హైకోర్టు ఆదేశాలతో కదిలిన అధికార గణం
తెలంగాణలోని పంచాయతీల్లో పాలక మండలి సభ్యుల గడువు 2024, జనవరి 31తో ముగిసింది. అప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే దీనిపై సర్పంచ్‌లు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 25వ తేదీన మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది. 42 శాతం రిజర్వేషన్లను ఈ పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు జీవోను జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘానికి ఈ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన ప్రభుత్వం
బీసీ సంక్షేమ శాఖ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్-9ని జారీ చేసింది. ఇలా దేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గతంలో బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినా, అవి న్యాయస్థానాల ముందు నిలబడలేదు. అయితే వీటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ సిఫారసుల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగింది. దీని వల్ల సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్ వంటి పదవుల్లో బీసీలకు 42 శాతం పదవులు దక్కనున్నాయి.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలపై షెడ్యూల్
బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల ప్రక్రియను అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషన్ వేగవంతం చేస్తోంది. అదే రీతిలో తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సామాజిక న్యాయానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించాయి. గ్రామ స్థాయిల్లో బలమైన బీసీ అభ్యర్థుల వేటలో అన్ని పార్టీలు పడ్డాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన రాజకీయ తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. సరి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలయిన బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు నిర్వహించే అధికారుల సమావేశం తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతోనూ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.