Telangana Government Changed Guarantees Inauguration Venue: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మరో రెండు గ్యారెంటీల హామీలకు సంబంధించి ప్రారంభోత్సవ వేదిక మారిందని తెలుస్తోంది. రాష్ట్ర సచివాలయంలోనే మంగళవారం మధ్యాహ్నం ఈ పథకాలను ప్రారంభించనున్నట్లు సమాచారం. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను మంగళవారం చేవెళ్ల బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వర్చువల్ గా ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల కావడం.. వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో వేదికను మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సచివాలయంలోనే ఈ 2 పథకాలను ప్రారంభించిన అనంతరం చేవెళ్లలో యథావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.


ప్రియాంక గాంధీ పర్యటన రద్దు


మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన రద్దైంది. మంగళవారం ఆమె చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభా వేదికగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. దీని కోసం తగిన ఏర్పాట్లు సైతం చేసింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దైందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. ఇక, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27న (మంగళవారం) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


పథకం అమలు ఇలా


రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే, పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500 అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ (DBT - Direct Benefit Transfer) ద్వారా రీయింబర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోన్న రూ.40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.955 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలుస్తోంది.


 


Also Read: Insurance for Singareni Employees: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ - రూ.1 కోటి ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి