Telangana Formation Day 2026 | హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే పలు జాబ్ నోటిషికేషన్లను టీజీపీఎస్సీ విడుదల చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం... రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదన్నారు. ప్రత్యేక తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకలలో భాగంగా విధుల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు.
కాళోజీ మాటల స్ఫూర్తితో ముందుకెళ్తున్న తెలంగాణ"పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాటలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. కాళోజీ స్ఫూర్తితోనే తాము అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల హితం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, తమది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం అన్నారు. గత 30 నెలల తమ పాలనలో ప్రజా సంకల్పాన్ని నిజం చేయడంలో విజయవంతం అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణ విజన్-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఈ వేదికగా హామీ ఇచ్చారు.
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఇప్పటివరకు 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ (TGPSSC) ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్, విద్యాశాఖల్లో ఖాళీలకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, విద్యా రంగంలో భాగంగా ఇప్పటికే 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ క్లాసులు ప్రారంభించామన్నారు. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని, త్వరలోనే జూనియర్ కాలేజీల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
అర్హులైన పేదల సొంతిల్లు కల సాకారంపేదలకు సొంతింటి కలను సాకారం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అద్దె ఇళ్ల బాధలు, కష్టాల నుండి పేదలకు విముక్తి కలిగించేందుకు గత 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించగా, ఇందుకోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, ఈసారి క్యూఆర్ (Core Urban Region Economy) పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. కొత్త రేషన్‌కార్డులను కూడా పంపిణీ చేసి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపామన్నారు.
