Telangana Formation Day Celebrations: కోట్లాది ప్రజల త్యాగాల ఫలితం తెలంగాణ అని, నేటితో రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి కలిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల (Telangana Formation Day) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుని 11 సంవత్సరంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ అభినందనలు తెలిపారు.
ఈ ఏడాది జూన్ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యముందని రేవంత్ రెడ్డి అన్నారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. ఇకపై విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకే దక్కుతాయని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో దారితప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టడం, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు. రంగాల్లోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమాలు
తెలంగాణ అవతరించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు పాల్గొంటారు. అనంతరం సీఎం, మంత్రులు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అక్కడ గౌరవ వందనం స్వీకరస్తారు. అనంతరం అందెశ్రీ స్వరపరిచిన తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సోనియా గాంధీ వీడియో సందేశాన్ని ప్రదర్శిస్తారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన పనులు, అభివృద్ధి గురించి ప్రసంగంలో వివరించనున్నారు.
ట్యాంక్ బండ్ వద్ద స్టాళ్లు, కార్నివాల్
సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలనె తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. ఉత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పర్యవేక్షించారు. పర్యాటక ప్రదేశాలైన చార్మినార్, ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, అమరజ్యోతి స్థూపం, బీఆర్ అంబేద్కర్ విగ్రహం, గోల్కొండ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజల కోసం ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక హస్తకళల స్టాళ్లు, ఫుడ్ స్టాళ్లు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం కార్నివాల్ నిర్వహించనున్నారు. అలాగే ఉత్సవాల సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు.
పీసీసీ ప్రత్యేక శకటం
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ పీసీసీ ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ దీప్ దాస్ మున్షీ గాంధీ భవన్‌లో శనివారం శకటాన్ని ప్రారంభించారు. గతంలో సోనియా గాంధీని కేసీఆర్ పొగిడిన మాటలను ఈ శకటంలో పొందుపరిచారు. సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ రాష్ర్టం సాకారమైంది. ఈ అంశంలో ఎవరికి అనుమానం అవసరం లేదు’ అని తొలి అసెంబ్లీ సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ మాటలను ప్రజలకు వినిపించేలా మైక్‌లను ఏర్పాటు చేశారు.