Revanth Reddy: కాంగ్రెస్ (Telangana Congress Party) అధికారంలో ఉండగానే దౌల్తాబాద్‌లో అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వికారాబాద్‌ జిల్లా దౌలతాబాద్‌ (Doulthabad)లో విజయభేరి యాత్ర (Vijayabheri Yatra) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడుతూ.. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని, పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కానీ మళ్లీ  గెలిపించాలని అడుగుతున్నారని విమర్శించారు.


నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా.. మన ప్రాంతాన్ని పాడు చేశారని ధ్వజమెత్తారు. దౌల్తాబాద్‌లో ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు అన్నీ తాను తీసుకొచ్చినవేనని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామన్నారు.


రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని.. రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. చేయూత పేరుతో వృద్దులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు.. అర్హలైన వారికి నెలకు రూ.4000 పెన్షన్‌​ ఇస్తామని హామీ ఇచ్చారు. 


రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు ఇస్తామన్నారు. పంట పండించే రైతులకు.. మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్‌ కింద కలిపి చెల్లిస్తామన్నారు. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తామని చెప్పారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే చేయూత పథకం ద్వారా రూ.4 వేలు పెన్షన్ అందిస్తామని చెప్పారు. 


కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ చేస్తామని, కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల కష్టాలు తెలుసని, రైతుబంధు తామెందుకు బంద్ చేస్తామని ప్రశ్నించారు. నరేందర్​రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఇసుక దందా, ట్రాక్టర్లపై కమిషన్లు తీసుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్​ హయాంలో నారాయణపేట- కొడంగల్​ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోస్తే.. నిర్మించకుండా వదిలేశారని విమర్శించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.  


బీఆర్​ఎస్​ హయాంలో ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు, రైల్వే లైన్​, డిగ్రీ కాలేజ్​ ఏవి తీసుకురాలేదని దుయ్యబట్టారు. మద్దూరులో తాగునీటి సమస్య వల్ల ఈ ఊరికి పిల్లనిచ్చే వాళ్లు కాదని.. తన హయాంలోనే కోయిల్ సాగర్ నుంచి నీటి వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 100 పడకల హాస్పిటల్, స్టేడియం నిర్మిస్తామన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేసి.. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చే బాధ్యత కాంగ్రెస్​దని హామీ ఇచ్చారు.


సీఎం కేసీఆర్​.. డబుల్​బెడ్​ రూం ఇళ్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. తాను మాత్రం పంజాగుట్టలో రూ. 2000కోట్లతో ఇంద్రభవనం నిర్మించుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఇల్లులేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షతో పాటు.. తులం బంగారం ఇస్తామన్నారు.