KTR Slams Congress in Kamareddy Roadshow: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 'ధరణి' (Dharani Portal) పోర్టల్ ఎత్తేసి పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని చూస్తోందని, దీంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పవని మంత్రి కేటీఆర్ (KTR) విమర్శించారు. కామారెడ్డిలో (Kamareddy) నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రైతన్నకు భరోసా బీఆర్ఎస్ పార్టీ అని, ధరణి కావాలా? పట్వారీ వ్యవస్థ కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. పదేళ్లలో  సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన అభివృద్ధి కళ్ల ముందే ఉందని, తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్.1 స్థానంలో నిలిచిందని అన్నారు. ధరణి ఎత్తేస్తే దళారుల రాజ్యం వస్తుందన్నారు. 24 గంటల కరెంట్‌ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 'సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తాం. సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తాం. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం.' వంటి హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.


'ధరణి'లో లోపాలు సరిచేస్తాం'


అన్ని విధాలుగా ఆలోచించే రైతులకు మేలు చేసేలా 'ధరణి' పోర్టల్ తీసుకొచ్చామని, దీంతో దళారీ రాజ్యం పోయిందని కేటీఆర్ చెప్పారు. 'ధరణిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే మంచిగా చేసుకుందాం. ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లును కాలబెట్టుకోం కదా? ధరణి కూడా 90 శాతం మంచిగా ఉంది. ఆ 10 శాతం కూడా మంచిగా చేసుకుందాం.' అని కేటీఆర్ తెలిపారు.


'కేసీఆర్ రాకతో కామారెడ్డి అభివృద్ధి'


సీఎం కేసీఆర్ తొలిసారి కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, ఆయన వస్తే కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయని, అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ ప్రధాని మోదీ, రాహుల్ కు ఉంటుందా.? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్ అంటున్నారని, అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశారని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పాత సీసాలో కొత్త సారాలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా మనోడు మనోడు అవుతారని, మందోడు మందోడు అయితారని అన్నారు. మనోడిని గెలిపించుకుని రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించుకుంటారో.? ఢిల్లీ వాళ్లను నెత్తిన పెట్టుకుంటారో.? ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా మారిందని, ఇప్పటికే కాళేశ్వరం జలాలు మంచిప్ప దాకా వచ్చాయని, రాబోయే ఏడాదిలో ఇక్కడి వరకూ తీసుకొచ్చే బాధ్యత తనదని కేటీఆర్ హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


'వారికి అభివృద్ధి కనిపించడం లేదు'


తెలంగాణలో అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నా కాంగ్రెస్ వారికి కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏ గ్రామంలో చూసినా వడ్ల రాశులే కనిపించాయని, కాంగ్రెస్ హయాంలో ఇలా జరిగిందా.? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేశామని, గతంలో పెన్షన్లు రాకపోయినా ఎవరూ అడిగేవారు లేరని, నేటి పరిస్థితి అలా కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలతో ఆగం కావొద్దని, అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని సూచించారు.


Also Read: Telangana Elections 2023 : కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోనందుకే పార్టీ మార్పు - బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే - విజయశాంతి కీలక వ్యాఖ్యలు