Telangana Elections 2023 : కాంగ్రెస్‌లో టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి శనివారం పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్ తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. మాకెందుకు ఆ నిబంధన అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయారెడ్డికి ఖైరతాబాద్ టిక్కెట్ ను కాంగ్రెస్ కేటాయించింది.
తాను జూబ్లీహిల్స్‌లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయి. కావాలనే నాకు టిక్కెట్ ఇవ్వలేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టికెట్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ, అనూహ్యంగా జాబితాలో నా పేరు లేకపోవడంతో నేనే షాక్ అయ్యానన్నారు. పార్టీకి ఎవరు ముఖ్యమో అది ముందు గమనించాలి. పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. నేనే వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయన్నారు. ఎస్సీ, బీసీ, సెటిలర్స్ ఉన్న నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ కోసమే టిక్కెట్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తానని..
ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఇచ్చారన్నారు.
పార్టీకోసం కష్టపడ్డా,నని హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే పీజేఆర్ అనేవాళ్ళు. జూబ్లీహిల్స్ నుండి పోటీలో ఉంటా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. గతంలో మాజీ క్రికెటర్ జూబ్లీహిల్స్‌లోని పలు వేదికలపై సమావేశాలు నిర్వహించినప్పుడు, విష్ణువర్ధన్ రెడ్డి అజారుద్దీన్‌ను అలాంటి సభలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి 2004, 2009లో జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందగా, 2014, 2018లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాహుల్ గాంధీ సభలకు కూడా హాజరు కాకపోవడంతో ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జరిగింది.
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా ఆయన వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయనపై కూడా విమర్శలు చేశారు. చివరికి పార్టీ కోసం పని చేయలేదన్న కారణంగానే ఆయనను పక్కన పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. జూబ్లిహిల్స్ లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో పాటు క్రికెట్ టీమ్ కెప్టెన్ గా పాపులారిటీ సాధించిన అజహర్‌కు అందరూ మద్దతు ఇస్తారని అందుకే ఆయనను నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.