గతంలో వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతంలో ఎంతో మంది మంత్రులుగా పని చేశారని.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి పట్టుబట్టి.. మొత్తం 5 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.


ఆనాడు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవరని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతున్నప్పుడు నోరెత్తకుండా ఉండిపోయింది ఎవరని ప్రశ్నించారు. ఇప్పుడు వనపర్తికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాబోతోందని, అది వస్తే లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని అన్నారు. వరి పంటల వనపర్తి చేసిన మొనగాడు కావాలా? లేనిపోని ఉల్టాపల్టా చిల్లరగాళ్లు కావాలా అని ప్రజల్ని అడిగారు. కరవు మళ్లీ ఎదురు కాకుండా వనపర్తి తయారవుతుందని చెప్పారు.


తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారని అన్నారు. నేను రావాల్సిన అవసరం లేదని అన్నారు. ముస్లింలను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకు లాగానే చూసిందని విమర్శించారు. అడ్డం పొడుగు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ గతంలో అన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారని గుర్తు చేశారు. వాళ్లు తేలేని మెడికల్ కాలేజీలను నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నారని అన్నారు.


తెలంగాణ గురుకులాల్లో ఇవాళ వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారని.. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పబోమని అన్నారు. మళ్లీ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతులకు ఏ ప్రభుత్వమైనా డబ్బులు ఎదురిచ్చిందా అని ప్రశ్నించారు.