Bellampalli Municipal Commissioner: బెల్లంపల్లి: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఓ అధికారిపై బదిలీ వేటు పడింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కె. సమ్మయ్యపై బదిలీ వేటు వేశారు.  ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలతో కమిషనర్ సమ్మయ్యను బదిలీ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. 


నవంబర్ 8వ తేదీన బెల్లంపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ జరిగింది. అయితే ఈ సభకు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ చేశారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంపై వివాదం నెలకొంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కె. సమ్మయ్యపై బదిలీ వేటు వేశారు. సమ్మయ్యను బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మున్సిపల్ కమిషనర్ గా రెవెన్యూ అధికారి భుజంగానికి అదనపు బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగించినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.


ఎన్నికల అధికారుల ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ వ్యవహారంపై వరంగల్ ఆర్ డీ ఎం ఏ షాహిద్ మసూద్ విచారణ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన  మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య లాంగ్ తీసుకున్నారు. తాజాగా ఆయనను నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో హైదరాబాద్ కు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.