Telangana Election News: తెలంగాణ ఎన్నికలకు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి (BRS) ఊరట దక్కింది. రైతు బంధు (Rythubandhu) నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో వెంటనే రైతు బంధు నిధుల విడుదలను ప్రభుత్వం ప్రారంభించింది. ఫలితంగా రైతు బంధు నిధుల విడుదలకు అడ్డంకులు తొలగినట్లయింది. అయితే, నవంబర్ 28 సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగుస్తున్నందున, ఆ లోపు మాత్రమే రైతుబంధు నిధుల చెల్లింపులు చేపట్టాలని ఈసీ స్పష్టం చేసింది. అప్పటి నుంచి నవంబర్ 30న పోలింగ్ ముగిసే వరకూ నిధులను జమ చెయ్యొద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం  రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో శనివారం (నవంబరు 25) నుంచి సొమ్ము జమ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ మొత్తం రూ.7,700  కోట్లకు పైగా ఉంటుంది.


అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే రైతు బంధు నిధుల విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక ప్రభుత్వానికి పరిమితులు ఉంటాయి. దీంతో రాష్ట్రంలో అమలు కావాల్సిన ఈ రైతు బంధు నిధుల విడుదల నిలిచిపోయింది. ఆ నిధులను లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల విడుదల, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అధికారులను కోరింది. తెలంగాణ ఎన్నికల సంఘం ఈ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు తీసుకు వెళ్లగా.. రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు విడుదలకు అనుమతి ఇచ్చారు.