Problem of five villages in Khammam: తెలంగాణలోని భద్రాద్రితో విడదీయలేని అనుబంధం ఉన్న  ఐదు గ్రామాల వ్యవహారం ఇప్పుడు  మళ్లీ రాజకీయం అవుతోంది. ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని తెలంగాణ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మంత్రి తుమ్మల అమిత్ షాకు లేఖ రాశారు. 

Continues below advertisement

ఏడు మండలాలతో పాటే ఏపీలో కలిసిన ఐదు గ్రామాలు

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. అయితే, భద్రాచలం పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ఐదు గ్రామాలు  భౌగోళికంగా భద్రాద్రికి ఆనుకుని ఉంటాయి. భద్రాచలం గుడికి సంబంధించిన సుమారు 900 ఎకరాల భూమి ఈ గ్రామాల్లోనే  ముఖ్యంగా పురుషోత్తపట్నంలో  ఉంది. ఈ గ్రామాలు ఏపీలో ఉండటం వల్ల భద్రాచలం కేవలం 10 చదరపు కిలోమీటర్ల చిన్న పట్టణంగా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఆలయ విస్తరణకు లేదా పట్టణ అభివృద్ధికి స్థలం లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య.

Continues below advertisement

తెలంగాణ ఎందుకు పట్టుబడుతోంది?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధికి  586 కోట్ల భారీ మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్టు సజావుగా సాగాలన్నా, గోదావరి వరదల నుండి భద్రాద్రిని రక్షించడానికి కరకట్టలు నిర్మించాలన్నా ఈ ఐదు గ్రామాలు తెలంగాణలో ఉండటం అత్యవసరం. అలాగే, ఈ గ్రామాల ప్రజలు తమ పరిపాలనా అవసరాల కోసం 280 కి.మీ దూరంలో ఉన్న ఏపీ జిల్లా కేంద్రం  కంటే, కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న భద్రాచలంపైనే ఆధారపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం కోసం వీటిని కలపాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రికి తాజాగా లేఖ కూడా రాశారు.

న్యాయపరమైన , రాజ్యాంగపరమైన ఆటంకాలు

రాజకీయంగా హామీలు ఇవ్వడం సులభమే కానీ, దీనిని అమలు చేయడం ఒక పెద్ద ప్రక్రియ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దులను మార్చాలంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలి.  కేవలం ఒక రాష్ట్రం కోరితే కుదరదు; ఏపీ , తెలంగాణ అసెంబ్లీలు దీనికి అంగీకరిస్తూ తీర్మానాలు చేయాలి.  2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే సాధ్యం.

ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని ఏపీ ప్రభుత్వం

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని కూటమి ప్రభుత్వం దీనిపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. సొంత భూభాగాన్ని వదులుకోవడం అనేది ఏపీలో రాజకీయంగా విమర్శలకు దారితీస్తుందనే ఆందోళన అక్కడి ప్రభుత్వానికి ఉండవచ్చు.  పోలవరం ముంపు పరిధిలోకి రాని ఈ గ్రామాలను తెలంగాణకు ఇస్తే తమకు వచ్చే నష్టమేమీ లేదని ఏపీ భావిస్తేనే ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది.  ఈ గ్రామాలను విలీనం చేయగలిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పట్టు తిరుగులేకుండా పోతుంది. ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది.

గత పదేళ్లలో చేయలేని పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే, అది బీఆర్ఎస్‌కు రాజకీయంగా కొంత నష్టమే. అందుకే తాము కూడా మొదటి నుండి దీనిని కోరుతున్నామని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. భద్రాద్రి రాముడి భూములు ,  భవిష్యత్తు ఈ ఐదు గ్రామాల విలీనంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం సరిహద్దు మార్పు కాదు, సరిహద్దుల కంటే ఎక్కువగా ప్రజల సౌలభ్యం , ఆధ్యాత్మిక సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం. కేంద్రం సానుకూలంగా స్పందిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లేకపోతే రాజకీయం జరుగుతూనే ఉంటుంది.