Telangana Covid19 Cases: హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు డబుల్ డిజిట్ కు చేరుకున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ బుధవారం కరోనా బులిటెన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు దేశంలో నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అప్రమత్తం చేసింది. సాధ్యమైతే బయటకు వచ్చినప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలని చెబుతున్నారు. గతంలో తరహాలోనే భౌతిక దూరం పాటించడం, గుంపులోకి వెళ్లకపోవడమే ఆరోగ్యానికి మంచిదని ప్రజలను వైద్యశాఖ మంత్రి, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొవిడ్ నియంత్రణపై రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కేంద్రం సమీక్ష
కరోనా కొత్త వెరియంట్ JN - 1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంసుఖ్ మండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వెరియంట్ JN - 1 మహమ్మారి కట్టడి పై తీసుకోవాల్సిన జాగ్రత్త లపై కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మంసుఖ్ మాండవీయ అధ్వర్యంలో అన్ని రాష్ట్రాల వైద్య, అరోగ్య శాఖ మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర సచివాలయం నుండి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కొత్త వెరియంట్ JN - 1 మహమ్మారి కట్టడి పై తీసుకుంటున్న మందస్తు చర్యలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి , డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.