వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోతోంది. అందులో భాగంగా సమావేశాలు పెట్టుకొని రాజకీయ పరంగా వ్యూహాలు తయారు చేసుకుంటున్నారు. నేడు (జూలై 23) కాంగ్రెస్ నేతల పీఏసీ (రాజకీయ వ్యవహారాలు కమిటీ) కీలక భేటీ గాంధీ భవన్ లో జరగనుంది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అంతర్గత సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ పీసీసీ నేతల పీఏసీ మీటింగ్ జరగనుంది. 


రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలు అందరూ ఐక్యంగా ఉన్నారని చాటడానికి సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు చెందిన ప్రణాళిక, ఎప్పుడు మొదలు పెట్టాలనే విషయాలను కూడా ఖరారు చేస్తారని సమాచారం.


ప్రియాంక సభపైనా చర్చ


అంతేకాక, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నిర్వహించనున్న బస్సు యాత్ర, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, ప్రియాంకా గాంధీతో నిర్వహించబోయే కొల్లాపూర్‌ సభలపై కూడా ఈ పీఏసీ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.


తెలంగాణలోని వివిధ చోట్ల గతంలో మాజీ మంత్రులుగా పని చేసిన వారు లేదా మాజీ ఎమ్మెల్యే స్థాయి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ఆహ్వానించడంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక సందర్భంగా ఈనెల 30న కొల్లాపూర్‌లో జరిగే సభపైన కూడా, ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.


ఈ సమావేశానికి ప్రధాన నేతలైన పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.