Komatireddy Rajagopal Reddy:  తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారయిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకూ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారంతా ఒక్క సారిగా యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోం శాఖ అంటే చాలా ఇష్టమని మీడియాకుచెప్పారు. అయితే ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తా.. ప్రజల పక్షాన నిలబడతానన్నారు.  

ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగు భర్తీ చేయాలని అనుకుంటున్నారు ఈ నాలుగు ఎవరెవరికి అన్నదానిపై హైకమాండ్ స్పష్టత ఇచ్చిందని అంటున్నారు. ఇందులో కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.  రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. నల్లగొండ జిల్లా నుంచి మరో సీనియర్ నేత  ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. కానీ ప్రాతినిధ్యం లేని జిల్లాలుచాలా ఉన్నాయి.  ఈ క్రమంలో  అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికి మరో మంత్రి పదవి దక్కడం కష్టమే. కులగణన చేసి బీసీ ఆకర్ష్ రాజకీయాలు చేస్తున్నందున బీసీలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.            

అయితే కాంగ్రెస్ హైకమాండ్ తనకు హామీ ఇచ్చిందని ఖచ్చితంగా పదవి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. తనకు తాను హోశాఖను ప్రకటించుకున్న తీరుపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లడంతో వెంటనే ఆయన బుధవారం మరోసారి మీడియాకు క్లారిటీ ఇచ్చారు. నాకు హోం శాఖే ఇవ్వాలని అనలేదని.. హోం శాఖ అంటే ఇష్టమని చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. అయితే హోం శాఖ మంత్రి అయితే బాగుంటుందని నా అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్టు మీడియా చిట్‌చాట్‌లో చెప్పానన్నారు. ఈ విషయంపై అధిష్టానందే తుది నిర్ణయం.. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతాయుతంగా పని చేస్తానని రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో చెప్పారు. 

అయితే అసెంబ్లీలో మాత్రం తాను హోంమంత్రిని అయిపోయినట్లేనన్నట్లుగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటున్నారు. దీంతో కోమటిరెడ్డికి మంత్రి పదవి కేటాయించకపోతే ఎలా స్పందిస్తారోనని కాంగ్రెస్ లో చర్చ ప్రారంభమయింది.