Revanth Reddy to visit his Village Kondareddypally | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. స్వగ్రామంలో దసరా వేడుకల్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని తన స్వగ్రామం కొండారెడ్డిప‌ల్లికి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా కొండారెడ్డిపల్లిలో  విజయదశమి వేడుకల్లో పాల్గొననున్నారు. సీఎం హోదాలో రేవంత్ స్వగ్రామం రానుండటంతో కొండారెడ్డిపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. సీఎం రాక కోసం గ్రామస్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు సైతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వగ్రామం కావడంతో ఎక్కువ మంది రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొండారెడ్డిపల్లిలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. 


సాయంత్రం సొంతూరుకు సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా తొలి దసరా పండుగను రేవంత్ రెడ్డి సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుపుకోనున్నారు. అటు దసరా వేడుకలతో పాటు ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. స్వగ్రామంలో తన కుటుంబం, స్నేహితులు, గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. 


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. బీసీ భవనం, గ్రంథాలయం, గ్రామ పంచాయతీ, పశువైద్య శాలలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వాడకంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిని తొలి సౌర విద్యుత్ ఆధారిత గ్రామంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


Also Read: Telangana: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు 


శంకుస్థాపనకు, అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం..
కొండారెడ్డి పల్లి గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా కొండారెడ్డిపల్లిలో సోలార్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. దాంతోపాటు అండర్ డ్రైనేజీ, చిల్డ్రన్స్ పార్క్, జిమ్, నాలుగు లైన్‌ల‌ రోడ్డు, సెంటర్ లైటింగ్,  దేవాలయం ఇతర పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటించేది ఆయన స్వగ్రామం కావడంతో ఆయన సన్నిహితులు, స్నేహితులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు సైతం పెద్ద సంఖ్యలో కొండారెడ్డిపల్లికి వచ్చి రేవంత్ రెడ్డితో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. కనుక సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతం, పర్యటించే ప్రదేశాలలో భద్రతను పోలీసులు పటిష్టం చేశారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు సహకరించాలని స్థానికులకు పోలీసులు సూచించారు.


చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. తెలంగాణ అతి పెద్ద పండుగ విజయదశమి. మన అందరిపై దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.