CM Revanth Reddy Launched Four New Schemes: గణతంత్ర దినోత్సవ వేళ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 4 కొత్త పథకాలను ప్రారంభించింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో పథకాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. రైతు భరోసా (Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,  కొత్త రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. భూమికి, విత్తనానికి మధ్య అనుబంధం.. రైతుకు, కాంగ్రెస్‌కు మధ్య ఉందన్నారు. దేశమంతా రైతులకు రుణమాఫీ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు అందించగా, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.11.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో పండుగలా ఈ వేడుకలు సాగుతున్నాయి.  ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలతో పాటు రైతు భరోసా, ఇందిమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అందజేశారు.


కాగా, రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. అలాగే, సాగుకు అనుకూలమైన భూములకు ఒక్కో ఎకరానికి 'రైతు భరోసా' పథకం కింద రూ.12 వేలు అందనుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 2 విడతల్లో రూ.12 వేల ఆర్థిక సాయాన్ని 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' కింద అందించనున్నారు. ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలకు ఈ పథకం వర్తించనుంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి.. ఇంటి స్థలం లేని పేదలకు ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి.


'రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర'


అంతకు ముందు డా.బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. వర్శిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని అన్నారు. 'వర్శిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది.?. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే. కేంద్రం వెంటనే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోవాలి.' అని డిమాండ్ చేశారు.


Also Read: Viral News: మహిళ ఇంటి ముందు బ్యాంక్ అధికారుల వినూత్న నిరసన, వంటావార్పుతో అంతా షాక్