హైదరాబాద్: డీఎస్సీ-2024 ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా పండగ మూడు రోజుల ముందే వచ్చినట్లు కనిపిస్తుందన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివిదెయ్యాన్ని సీఎంగా గెలిపించుకుంటే, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్సీ విజేతలకు ఉపాధ్యాయ నియామక పత్రాలను రేవంత్ రెడ్డి అందజేశారు.
తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు!
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి, ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. 2014లోనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ ను మూడేళ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆపై రెండేళ్ల తరువాత 2019 నియామకాలు జరిపారు. తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ ల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పాం. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ తో టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. ఇప్పుడు రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 మంది టీచర్ పోస్టుల విజేతకు నియామకపత్రాలు అందిస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఎందుకంటే రాష్ట్రం పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర కీలకం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 34,000 మంది టీచర్ల బదిలీల (Teachers Transfer)తో పాటు 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు (Teacher Promotions) అందించాం. మీ కుటుంబాల్లో సంతోషాన్ని చూసేందుకు తక్కువ సమయంలోనే నియామకపత్రాలు ఇస్తున్నాం. కానీ మీ సంతోషం చూసి కొందరికి కండ్లు మండుతున్నాయి. తెలంగాణలో గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కానీ పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించలేదు. మంచి చేయడానికి సలహాలు ఇవ్వరు. ఒకవేళ మేం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా, 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు మీరే.
ప్రభుత్వ బడిలో చదువుకున్నాను..
నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. తల్లితండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావించడానికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ స్కూళ్లలో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తాం. వాటి పనులకు అక్టోబర్ 11న పనులు ప్రారంభిస్తాం. మేం చదివింది గవర్నమెంట్ స్కూళ్లో అని గర్వంగా చెప్పుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
బీటెక్ చేసినా ఉద్యోగాలు లేవు..
తెలంగాణలో ప్రతి ఏడాది లక్ష మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. కానీ వారికి ఉద్యోగాలు రావడం లేదు. అందుకే స్కిల్స్ పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University) ద్వారా శిక్షణనిచ్చి వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: TGPSC: అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?