హైదరాబాద్: ప్రభుత్వ విద్యాసంవత్సరాల్లో ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు తెలంగాణ మంత్రిమండలి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీ-ప్రైమరీ క్లాస్ నుంచి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయం పూట అల్పాహారాన్ని అందించే తెలంగాణ అల్పాహార పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా, ఇకపై దానికి అదనంగా ఉదయం పూట అల్పాహారం, పాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయడంతో పాటు, మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని విద్యార్థులతో పాటు అక్కడే పనిచేసే టీచర్లు, లెక్చరర్లకు సైతం కల్పించారు.
రూ.925.41 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపు 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖకు రూ.733.46 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌కు రూ.191.95 కోట్లు చొప్పున కలిపి మొత్తం రూ.925.41 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం కింద ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు చదివే చిన్న పిల్లలకు రోజుకు 75 గ్రాములు, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు 100 గ్రాముల చొప్పున అల్పాహారాన్ని అందిస్తారు.
పాఠశాల విద్యార్థుల నిధుల వివరాలుఒక విద్యాసంవత్సరంలో స్కూల్ విద్యార్థులకు మొత్తం 230 రోజుల పాటు అల్పాహారం, 115 రోజుల పాటు కాచిన పాలను అందిస్తారు. ఇందులో భాగంగా, 1వ తరగతి (ప్రీ-ప్రైమరీ) నుంచి 5వ తరగతి వరకు చదివే 9,24,124 మంది విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.11.50 చొప్పున ఏడాదికి రూ.244.43 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, 6 నుంచి 10వ తరగతి చదివే 9,11,233 మందితో పాటు మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదువుతున్న 22,559 మంది విద్యార్థుల అల్పాహారం కోసం రోజుకు రూ.13.50 చొప్పున రూ.289.63 కోట్లు కేటాయించారు. పాఠశాలల్లో పాలు ఇచ్చే కార్యక్రమానికి అదనంగా రూ.199.4 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇంటర్ విద్యార్థుల కోసం ఏడాదికి రూ.9,875 ఖర్చుప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న 1,94,375 మంది విద్యార్థులకు విద్యాసంవత్సరంలో 220 రోజులు అల్పాహారం, 110 రోజులు పాలు, మరో 110 రోజులు బలవర్ధకమైన రాగిజావను ప్రభుత్వం అందించనుంది. బ్రేక్ ఫాస్ట్ కోసం రూ.2,970, పాలకు రూ.1,144, రాగిజావకు రూ.231 చొప్పున.. కేవలం ఉదయపు పోషకాహారం కోసమే ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.4,345 ఖర్చు కానుంది. వీరికి మధ్యాహ్న భోజనానికి అయ్యే రూ.4,367, ఇతర ఖర్చులతో కలిపి రూ.5,530 అవుతుంది. మొత్తంగా ఇంటర్ చదివే ఒక్కో విద్యార్థి అల్పాహారం, పాలు, రాగిజావ, మధ్యాహ్న భోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.9,875 చొప్పున భారీగా ఖర్చు చేయనుంది.
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెను వివరాలు..- సోమవారం : రెండు దోశలు, చట్నీ- మంగళవారం : రెండు మిల్లెట్ ఇడ్లీలు, సాంబారు- బుధవారం : రెండు పూరీలు, మిక్స్‌డ్ వెజ్ కర్రీ- గురువారం : రెండు బోండాలు, చట్నీ- శుక్రవారం : రెండు ఇడ్లీలు, చట్నీ- శనివారం : ఉప్మా, సాంబారు లేదా ఉప్మా, చట్నీ
