Telangana Election 2023: 
మరో రెండు నెలల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికలపై ఏపీ ప్రజలు దృష్టి సారించారు. ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు. ఏపీ రాజకీయ నేతలు కూడా ఒక కన్నేసి ఉంచారు. తాజాగా తెలంగాణ ఎన్నికలపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఏకంగా 70కిపైగా సీట్లలో విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజాగా కరీంనగర్‌లో గిడుగు రుద్రరాజు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై విమర్శనస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదని, ఆయన చేసిందేమీ లేదని ఆరోపించారు. టీ కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభకు లక్షలాదిమంది ప్రజలు తరలివచ్చారని, దీంతో సభ విజయవంతమైందని తెలిపారు. ఆ సభకు భారీగా వచ్చిన జనాలను చూస్తుంటే తెలంగాణ ప్రజల మూడ్ అర్థమవుతుందని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో సోనియాగాంధీ ప్రకటించిన హామీలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లాయని, వాటి గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల్లోకి చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.


బీజేపీ మాదిరిగా సోనియా గాంధీ నోటికొచ్చిన హామీలు ఇవ్వలేదని గిడుగు రుద్రరాజు అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో లోతుగా చర్చించిన తర్వాతనే ఎన్నికల  హామీలను ప్రకటించారని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని అమలు చేస్తారన్నారు. విజయభేరి సభ సక్సెస్‌తో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగిందని, కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. అటు ఏపీలో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, పార్టీ పుంజుకుంటుందని తెలిపారు.


ఆరు కీలక హామీలు


తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీ కాంగ్రెస్.. ఓటర్లను ఆకర్షించేందుకు ఆరు కీలక హామీలు ప్రకటించింది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వడంతో పాటు కౌలు రైతులకు కూడా దీనిని వర్తింపజేయనుంది. అలాగే రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక చేయూత పింఛన్ రూ.4 వేలు చేయడంతో పాటు యువ వికాసం కింద కాలేజీ విద్యార్థులకు రూ.5 లక్షలు అందిస్తామని తెలిపింది. ఇక పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలు ఉన్నాయి.


ఒక రాష్ట్రంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలపై పొరుగు రాష్ట్రానికి చెందిన నేతలు కూడా స్పందిస్తూ ఉంటారు. దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అని తెలుసుకునేందుకు పొలిటీషియన్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే తమ పక్క రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై కూడా ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏ పార్టీ గెలుస్తుందనేది అంచనా వేస్తూ ఉంటారు.