Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం వ్యవస్థాపక సభ్యురాలు మల్లు స్వరాజ్యం(Mallu Swarajyam) (92) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం. సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకట నర్సింహా రెడ్డి సతీమణి.  సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు మల్లు స్వరాజ్యం. వీరి కుమారుడే సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శి నాగార్జున రెడ్డి. మల్లు స్వరాజ్యం కోడలు లక్ష్మీ కూడా సీపీ(CPI)ఎంలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు. 


ఎర్ర జెండా పట్టి ప్రజా పోరాటాలు


సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం వ్యవస్థాపక సభ్యురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పై ఆమెకు చికిత్స అందించారు. మల్లు స్వరాజ్యం కుటుంబం మొత్తం చివరి వరకు పేద ప్రజల హక్కుల కోసం, ఎర్రజెండా పట్టి ప్రజా పోరాటాలు చేశారు. 


నా గొంతె తుపాకీ తూటా


తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా తుపాకీ పట్టుకుని పోరాడారు మల్లు స్వరాజం. ఆ తరువాత మహిళా నాయకురాలిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. అలనాటి పోరాటాలను వివరిస్తూ స్వరాజ్యం ‘నా గొంతె తుపాకీ తూటా' పేరుతో జీవిత కథను తీసుకొచ్చారు.


రెండు సార్లు ఎమ్మెల్యే 


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. గత పది రోజులుగా హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో ఉపిరితిత్తుల సమస్యతో ఆమె చికిత్స పొందుతున్నారు. మల్లు స్వరాజ్యం స్వగ్రామం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం. భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించించారు స్వరాజ్యం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు.  సోదరుడు దివంగత ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978- 83, 1983- 84 వరకు రెండు సార్లు ఆమె ఎమ్మెల్యేగా పని చేశారు.