Telugu News: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తమ తర్వాతి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ స్టే అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం తేల్చి చెప్పింది.
కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీం కోర్టుకు వెళ్లారు. గత ప్రభుత్వం తమను నియమించగా.. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైనే సుప్రీం ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా.. ధర్మాసనం అందుకు ఒప్పుకోలేదు.
కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.