Supreme Court: గవర్నర్ వద్ద పెండింగ్ పడుతున్న బిల్లుల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తరఫున వాదనలు వినిపించిన ఎస్జీ.. ప్రస్తుతం గవర్నర్ వద్ద ఏ బిల్లులు పెండింగ్ లో లేవని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని బిల్లులను మాత్రం తిప్పి పంపారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే.. ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం గవర్నర్ దయ కోసం చూడాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు.. బిల్లులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని రాజ్ భవన్ కు సూచించింది. ప్రస్తుతం బిల్లులు పెండింగ్ లో లేవు కాబట్టి ఈ పిటిషన్ ను ముగిస్తున్నామని తెలిపింది. 


బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెడుతున్నారంటూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 2022 సెప్టెంబర్ నుండి మూడు బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. గవర్నర్ కొన్ని బిల్లులను ఆమోదించారని, అందుకు సంబంధించిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సమర్పించారు. 


ఈ అంశంపై ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన గవర్నర్ కార్యాలయం నుండి ఒక నివేదిక కోర్టుకు అందిందని.. అది ప్రధాన న్యాయమూర్తి రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. కొన్ని బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారని.. అదే విషయాన్ని గవర్నర్ కార్యాలయం రిపోర్టులో పేర్కొందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత సవరణ బిల్లుపై వివరణ కోరగా.. రాష్ట్ర న్యాయ శాఖ నుండి ఎలాంటి స్పందన రాలేదని నివేదికలో పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు పెండింగ్ బిల్లుల విషయంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తాజాగా విచారణ చేపట్టిన కోర్టు.. బిల్లులను ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజ్ భవన్ ను సూచించింది.


గవర్నర్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. అసెంబ్లీలోని ఉభయ సభలు ఆమోదించిన  పది బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పాలనకు ఇబ్బందిగా మారుతుందని సుప్రీంకోర్టులో  పిటిషన్ వేశారు. ఇది ఇప్పటికే ఓసారి విచారణకు వచ్చింది. గతంలో విచారణకు రాగా.. తన వద్ద ఉన్న పెండింగ్ బిల్స్‌ను క్లియర్ చేశారు గవర్నర్. అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్లో మూడింటిని ఆమోదించినట్టు రెండింటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు మొన్నటి విచారణకు సుప్రీంకోర్టుకు తెలిపారు. మూడే బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నట్టు రాజ్‌భవన్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. గతంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న వేళ ఆ మూడింటినీ క్లియర్ చేశారు.